నివేదికను హైకోర్టు తప్పుపట్టలేదు
- కాళేశ్వరం ప్రాజెక్టు దోషులను వదిలిపెట్టేది లేదు
- పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్
హైదరాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): పీసీ ఘోష్ నివేదికను హైకోర్టు తప్పుపట్టలేదని, దోషులను వదిలిపెట్టేది లేదని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ అన్నారు. దర్యాప్తు జరిపిన విధానంలో తప్పులను ఎత్తి చూపిందని బుధవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగింది వాస్తవం, అది ప్రజలకు తెలుసు. రూ.లక్ష కోట్లతో నిర్మించిన ప్రాజెక్టు.. వారి హాయంలోనే కూలిపోయింది.. కుంగిపోయింది.
రాష్ట్ర ప్రభుత్వం వేసిన కమిషన్‌ను హైకోర్టు తప్పు పట్టలేదు ప్రోసీజర్ లాప్ప్ వున్నాయమని మాత్రమే చెప్పింది. కొద్ది రోజులు ఆగవచ్చు కానీ జైలుకు పోవడం ఖాయం అని మహేష్‌కుమార్‌గౌడ్ హెచ్చరించారు. హైకోర్టు తీర్పు సీబీఐ దర్యాప్తుకు కానీ, మరో దర్యాప్తుకు కానీ అడ్డంకి కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించి తదుపరి చర్యలకు పూనుకుంటుందని తెలిపారు.
బీఆర్‌ఎస్‌కు కాళేశ్వరం ఏటియంగా మారింది, సీబీఐకి అప్పగిస్తే నెల రోజుల్లో చర్యలు వుంటాయన్న బీజేపీ చెబితే.. తమ ప్రభుత్వం కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగిస్తూ జీవో, నోటిఫికేషన్ జారీ చేసిందని అన్నారు. ఇప్పుడు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు మాట్లాడటం లేదని ఆయన నిలదీశారు. బీఆర్‌ఎస్, బీజేపీకి లోపాయికారీ ఒప్పందం వుండబట్టే చర్యలు తీసుకోవడం లేదా..? అని ఆయన ప్రశ్నించారు.
హైకోర్టు ఎక్కడా, ఎవ్వరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదు.. ఎవరిని దోషులు కాదని, అవినీతికి పాల్పడలేదని ఎక్కడా చెప్పకపోవడంతో పాటు ఘోష్ నివేదిక ను ఎక్కడా హైకోర్టు తప్పుపట్టలేదన్నారు. బీఆర్‌ఎస్ నేతలకు క్లీన్ చిట్ ఇచ్చినట్లు, సంబరాలు చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. హైకోర్టు తీర్పును పూర్తిగా అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే సీబీకి విచారణకు అప్పగించినా ఎందుకు కేసు ముందుకు పోవడం లేదో కిషన్ రెడ్డి, బండి సంజయ్ సమాధానం చెప్పాలన్నారు.






