25-07-2025 12:42:12 AM
మహబూబాబాద్, జూలై 24 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా పరిధిలోని కొత్తగూడ గుంజేడు ముసలమ్మ దేవాలయం, తొర్రూరు మండలం అమ్మాపురం వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయాల్లో గురువారం కొండచిలువల సంచారం సంచలనం సృష్టించింది. గుంజేడు ముసలమ్మ దేవాలయ సమీపంలో చికెన్ సెంటర్ నిర్వహిస్తున్న యాకూబ్ కోళ్లను జాలిలో ఉంచి వెళ్ళాడు.
గురువారం ఉదయం షాపుకు చేరుకున్న యాకుబ్ కు కోళ్ల జాలి లో ఉన్న పెద్ద కొండచిలువ కనిపించడంతో బెంబేలెత్తిపోయాడు. వెంటనే ఈ విషయాన్ని సమీపంలో ఉన్న వారికి తెలియజేయగా అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి కొండచిలువను పట్టుకొని అడవిలో వదిలిపెట్టారు.
ఇక ఇదే తరహాలో తొర్రూరు మండలం అమ్మపురంలోని వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయంలో గురువారం కొండచిలువ హల్చల్ చేసింది. దేవాలయానికి వచ్చిన పూజారికి ఆలయంలో కొండచిలువ కనిపించడంతో విషయాన్ని అధికారులకు చేరవేయడంతో వారు వచ్చి కొండచిలువను పట్టుకొని అడవిలో వదిలిపెట్టారు.