ది ఇండియన్ బార్డర్ విజయం సాధించాలి
నివేద్య రెడ్డి నిర్మాణంలో డీఎస్ బాషా దర్శకత్వం వహించిన చిత్రం ‘ది ఇండియన్ బార్డర్’. ఈ సినిమాలో కిరణ్ యార్లగడ్డ, ఆదర్ష్, మురళీమోహన్, మేఘాశ్రీ, సిందు తులాని ముఖ్య పాత్రలను పోషించారు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి ఓ దేశ భక్తి గీతాన్ని విడుదల చేశారు. ‘జిందా రహేన్ తో డ్యూటీ’ అంటూ సాగే ఈ పాటకు ఆనంద్ మంత్ర బాణీ కూర్చగా, డీఎస్ బాషా సాహిత్యం అందించారు. శరవణ పాడారు. జవాన్ల త్యాగాల్ని, ధైర్య సాహసాల్ని గుర్తు చేసేలా ఈ పాట సాగింది.
ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో మేజర్ ఎస్పీఎస్ ఒబేరాయ్ మాట్లాడుతూ.. “దేశం గురించి, సైన్యం గురించి సినిమా తీయడం ఆనందంగా ఉంది. నాకు సినిమా ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేదు. ఈ మూవీ మంచి విజయం సాధించాలి” అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో హీరో, రైటర్ కిరణ్ యార్లగడ్డ, దర్శకుడు డీఎస్ బాషా, నిర్మాత నివేద్యరెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రామ్‌గోపాల్ చౌదరి, కొరియోగ్రాఫర్ రమేశ్ మాస్టర్, మ్యూజిక్ డైరెక్టర్ ఆనంద్ మంత్ర కూడా మాట్లాడారు.






