calender_icon.png 2 August, 2025 | 10:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశ ప్రయోజనాలే ముఖ్యం

01-08-2025 12:00:00 AM

  1. అమెరికా సుంకాల ప్రభావంపై అధ్యయనం చేస్తున్నాం

ట్రంప్ నిర్ణయంపై స్పందించం.. మౌనమే సమాధానం

ఆస్ట్రేలియా, బ్రిటన్‌లతో ఇప్పటికే వాణిజ్య ఒప్పందాలు

పార్లమెంట్ ఉభయసభల్లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

న్యూఢిల్లీ, జూలై 31: భారత్‌పై అమెరికా విధించిన 25 శాతం సుంకాలతో పాటు అదనపు పెనాల్టీ వ్యవహారంపై కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ గురువారం పార్లమెంట్ ఉభయసభల్లో ప్రకటన చేశారు. ట్రంప్ ప్రకటనపై, సుంకాల ప్రభావాలపై అధ్యయనం చేస్తున్నట్టు వెల్లడించారు. దేశ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.

పదేళ్లలోనే మూడో ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా భారత్ పయనిస్తోందన్న అంశా న్ని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ‘భారత్.. ఒక డెడ్ ఎకానమీ’ అని ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. పీయూష్ గో యల్ మాట్లాడుతూ.. ‘ఏప్రిల్ 2న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతీకార సుంకాలపై కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేశారు. భారత్ ఉత్పత్తులపై 26 శాతం టారిఫ్ విధిస్తున్నట్టు ప్రకటించారు.

ఏప్రిల్ 9 నుంచి టారిఫ్ అమల్లోకి వచ్చేలా షెడ్యూల్ చేశారు. అనంతరం దానిని 90 రోజుల పాటు తాత్కాలికంగా వాయిదా వేశారు. అప్పటివరకు 10 శాతం సుంకాలు విధించారు. ఆపై ఆగస్టు 1 వరకు పొడిగించారు. అయితే ఇప్పుడు హఠాత్తుగా భారత్‌పై 25 శాతం సుంకాలతో పాటు అదనపు పెనాల్టీ విధించారు. ట్రంప్ ప్రకటనపై పరిశీలిస్తున్నాం. ఇరుదేశాల మధ్య పరస్పర ప్రయోజనకరమైన ‘ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం’ కోసం మార్చిలో చర్చలు ప్రారంభమయ్యాయి. అక్టోబర్ నాటికి ఒప్పందంలో మొదటి దశను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.

అమెరికా నిర్ణ యాలకు స్పందించేది లేదు.. మౌనమే సమాధానం. ఏమి మాట్లాడాలో చర్చల సందర్భంగానే మాట్లాడతాం. అమెరికా నిర్ణయాల వల్ల కలిగే లాభ నష్టాలను, ప్రభావా లను పరిశీలిస్తున్నాం. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ ఎగుమతిదారులు, పరిశ్రమలు, ఇతర వాటాదారుల ఆందోళనలను అర్థం చేసుకోవడానికి వారిని సంప్రదిసు న్నాం. దేశ ప్రయోజనాలను పరిరక్షించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటాం.

2047 కల్లా ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధన కోసం సముచిత నిర్ణయాలు తీసుకుంటాం. ఆస్ట్రేలియా, బ్రిటన్ లాంటి అనేక దేశాలతో వాణిజ్య ఒప్పందాలు ఇప్పటికే చేసుకున్నాం. మరిన్ని దేశాలతో వాణిజ్యం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. రైతులు, వాణిజ్య వ్యాపార సంస్థల ప్రయోజనాలే మాకు ముఖ్యం. భారత్ స్వయం సమృద్ధితో కూడిన ఆర్థిక శక్తి. రైతులు, కార్మికులు, వ్యవస్థాపకులు, ఎంఎస్‌ఎంఈలు, పారిశ్రామిక వాటాదారుల ప్రయోజనాలను కాపాడటానికి అవస రమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం’ అని తెలిపారు.