calender_icon.png 1 January, 2026 | 2:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాల్సిందే

01-01-2026 12:57:14 AM

  1. రిజర్వేషన్లు పెంచాకే స్థానిక ఎన్నికలకు వెళ్లాలి
  2. లేదంటే అసెంబ్లీని ముట్టడిస్తాం
  3. సర్కార్‌కు బీసీ జేఏసీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరిక
  4. పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు పెడతాం : కాంగ్రెస్ నేత వీహెచ్
  5. ప్రధాని మోదీని కలిసి ఒప్పిద్దాం: మాజీ గవర్నర్ దత్తాత్రేయ
  6. సర్పంచ్ ఎన్నికల్లో బీసీలను కాంగ్రెస్ మోసం చేసింది: బీఆర్‌ఎస్ నేతలు 

హైదరాబాద్, సిటీ బ్యూరో డిసెంబర్ 31 (విజయక్రాంతి): కామారెడ్డి డిక్లరేషన్ చట్టబద్ధంగా అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ జేఏసీ డిమాండ్ చేసింది. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే రిజర్వేషన్లపై చర్చిం చి, కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా తీర్మానం చేసి ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని సూచించారు.  బీసీ రిజర్వేషన్లు పెంచకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు వెళితే ఊరుకునేది లేదని, అవసరమైతే వేలాది మందితో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు.

బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో అఖిలపక్ష పార్టీలు, బీసీ సంఘాల సంయుక్త సమా వేశం జరిగింది. గుజ్జ కృష్ణ సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ భేటీలో బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, కాం గ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు, బీఆర్‌ఎస్ నేతలు సిరికొండ మధుసూదనా చారి, వి.శ్రీనివాస్ గౌడ్, టీజేఎస్ నేత పల్లె వినయ్ తదితరులు పాల్గొని భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు.

సమావేశంలో జాజు ల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ..  రిజర్వేషన్ల పెంపు బాధ్యత కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలదేనని తేల్చిచెప్పారు.  రిజర్వేషన్ల సాధన కోసం జనవరిలో ‘బీసీ సర్పంచుల రాష్ట్ర సదస్సు’, ఫిబ్రవరి రెండో వారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ’బీసీల రథయాత్ర’ చేపడతామన్నా రు. ఏప్రిల్ నెలలో లక్షల మందితో హైదరాబాద్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని కార్యాచరణ ప్రకటించారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే నూతన సంవత్సరంలోనైనా బీసీ బిల్లుకు ఆమోదం తెలపాలన్నారు. 

ప్రధానిని మెప్పిద్దాం

రిజర్వేషన్ల అంశం జాతీయస్థాయి పరిధిలో ఉందని హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు.  ప్రధానిని ఒప్పించి, మెప్పించి రిజర్వేషన్లు సాధిం చుకుందామని, త్వరలోనే ప్రధాని అపాయింట్మెంట్ కోరి బీసీల పక్షాన విన్నవి స్తానని ఆయన హామీ ఇచ్చారు. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు వచ్చే బడ్జెట్ పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రైవేట్ బిల్లు ప్రవేశపెడతామని సీనియర్ నేత వి.హనుమంతరావు ప్రకటించారు. ఈ బిల్లు పెట్టినప్పుడు బీసీలకు అనుకూలంగా ఎవరున్నారో, వ్యతిరేకంగా ఎవరున్నారో తేలిపో తుందన్నారు. అందరూ సహకరిస్తే 42 శాతం రిజర్వేషన్లు సాధ్యమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

బీజేపీ, కాంగ్రెస్ నాటకాలు

మాజీ స్పీకర్ మధుసూదనా చారి, మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో రిజర్వేషన్లు పెంచకుండా 17 శాతానికే పరిమితం చేసి బీసీలను కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లోనైనా 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు.

బీజేపీ, కాంగ్రెస్లు కుమ్మక్కై నాటకాలాడుతున్నాయని విమర్శించారు. బీసీ రిజర్వేషన్లకు బీఆర్‌ఎస్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, కో-చైర్మన్ కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందరం గణేష్ చారి, తాటికొండ విక్రమ్ గౌడ్, సీపీఐ నేత ధనుంజయ నాయుడు పాల్గొన్నారు.