26-06-2025 12:00:00 AM
రజనీకాంత్ కథానాయకుడిగా లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న తాజాచిత్రం ‘కూలీ’. రజనీ కాంత్ కెరీర్‌లో 171వ సినిమాగా రాబోతున్న ఈ ప్రాజెక్టుకు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తుండగా.. సన్‌పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. టాలీవుడ్ అగ్ర హీరో నాగార్జున ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇంకా ఉపేంద్ర, శ్రుతిహాసన్, సత్యరాజ్, చౌబిన్ సాహీర్ తదితరులు మిగతా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
ఆగష్టు 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో మూవీ టీమ్ ప్రచార కార్యక్రమాలను పరుగులు పెట్టిస్తోంది. హిందీలో ఈ సినిమా టైటిల్ ‘మజ్దూర్’గా మారిన విషయాన్ని ఇటీవలే వెల్లడించిన టీమ్.. బుధవారం మరో ఆసక్తికర కంటెంట్‌ను రిలీజ్ చేసింది.
ఈ సినిమా నుంచి తొలిపాట ‘చికిటు’ను విడుదల చేయడం ద్వారా అభిమానుల్లో మరింత జోష్ నింపింది. ఈ చిత్ర సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకూర్చడమే కాక టీ రాజేందర్, అరివుతో కలిసి ఈ పాటను పాడారు. గీత సాహిత్యాన్ని అరివు అందించారు.