07-01-2026 12:59:30 AM
అసెంబ్లీ, మండలిలో బిల్లు ఆమోదం
హైదరాబాద్, జనవరి 6 (విజయక్రాంతి):నల్లగొండ మున్సిపాలిటీ కార్పొరేషన్‌గా మారింది. కార్పొరేషన్‌గా ఆప్‌గ్రేడ్ చేస్తూ తెలంగాణ అసెంబ్లీ, మండలిలో మంగళవారం బిల్లు ఆమోదం పొందినది. జిల్లా కేంద్రమైన నల్లగొండ శరవేగంగా అభివృద్ది చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పెరిగిన జనాభా కారణంగా ప్రస్తుత మున్సిపాలిటి రోజు రోజుకు విస్తరిస్తూ వస్తోంది.
కార్పోరేషన్‌గా అప్‌గ్రేడ్ కావడానికి రూ. 20 కోట్ల వార్షికాదాయంతో పాటు 2 లక్షల జనాభా ఉంటే సరిపోతుంది. అయితే నల్లగొండకు రూ.40 కోట్ల ఆదాయంతో పాటు 2.5 లక్షల జనాభా ఉండటంతో కార్పొరేషన్‌గా మార్చడం సులువైంది. నల్లగొండ మున్సిపాలిటిగా ఏర్పడినప్పుడు వార్షిక బడ్జెట్ రూ. 10 వేలు మాత్రమే ఉండేది. ఇప్పుడు కార్పోరేషన్ మారడం వల్ల పట్టణానికి నిధుల రాక పెరుగుతుందని, మౌలిక సదుపాయాలు మెరుగుపడుతాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా నార్కట్‌పల్లిని రెవెన్యూ డివిజన్‌గా చేయాలని, అమ్మనబోల్ గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే వేముల వీరేశం సభ దృష్టికి తీసుకొచ్చారు.