01-05-2025 12:52:52 AM
నాగర్ కర్నూల్ ఏప్రిల్ 30 (విజయక్రాంతి): వరి ధాన్యం కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లకు సరఫరా చేసే లారీ కాంట్రాక్టర్, లారీ అసోసియేషన్ ఓనర్స్ మధ్యన కమిషన్ల వ్యవహారంలో అంతర్యుద్ధం కొనసాగుతోంది. ఫలితంగా ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యం అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే అకాల వర్షంతో దాన్యం తడిసి ముద్దయింది.
కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తూకాలు పూర్తయి బస్తాలకు నింపినప్పటికీ సరైన సమయానికి లారీలు కొనుగోలు కేంద్రాల వద్దకు రాకపోవడంతో కొనుగోలు కేంద్రాల వద్ద సరైన వసతులు లేక వర్షపు నీటిలోనే ధాన్యం తడిసింది. ధాన్యాన్ని సరఫరా చేసే లారీలను కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ముఖ్య నేతలు తమకు కమిషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులను లారీలను నడపకుండా అడ్డుకుంటున్నారు.
ఈ అంతర్యుద్ధం గత కొంతకాలంగా జరుగుతున్నప్పటికీ ఉన్నతాధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడంతో చివరికి కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం పూర్తిగా ఎండకు ఎండుతూ వానకు తడుస్తోంది. ఈ ఏడాది రబీ సీజన్ రైతులు పండించిన వరి ధాన్యాన్ని సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల వద్ద సేకరించిన వరి ధాన్యాన్ని ఆయా మిల్లులకు సరఫరా చేసేందుకు ట్రాన్స్పోర్ట్ టెండర్లను పిలిచింది.
కానీ పోలీసు బందోబస్తు మధ్య కాంగ్రెస్ నేతలకు అనుకూలంగా అక్రమ టెండర్లు దాఖలు కావడంతో కొంతమంది లారీ ఓనర్స్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో టెండర్ ప్రక్రియ ఆలస్యం కావడంతో అక్రమంగా టెండర్ దక్కించుకున్న సదరు కాంట్రాక్టర్లు తాము రవాణా చేయలేమంటూ చేతులెత్తేశారు. చివరికి 2023- 24 రబీ సీజన్లో టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ కె తిరిగి అప్పగించారు.
దీంతో సదరు కాంట్రాక్టర్ కొనుగోలు కేంద్రాల వద్దకు లారీలను సరఫరా చేసే క్రమంలో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న కొందరు నేతలు లారీ ఓనర్స్ అసోసియేషన్ పేరుతో లారీ డ్రైవర్లను బెదిరిస్తూ లారీలను వెళ్లకుండా అడ్డుకున్నట్లు ఆరోపణలు వేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో బుధవారం కురిసిన అకాల వర్షానికి జిల్లాలోని 234 వరి కొనుగోలు సెంటర్ల వద్ద సేకరించిన వరి ధాన్యం బస్తాలు పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. లారీ టెండర్ దారులు లారీ ఓనర్స్ అసోసియేషన్ల మధ్య జరుగుతున్న అంతర్యుద్ధం వ్యవహారం జిల్లా ఉన్నతాధికారులకు తెలిసినప్పటికీ అంతగా పట్టించుకోలేదని ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.