01-05-2025 12:54:23 AM
భద్రాచలం దేవస్థానం ఈవో ఎల్ రమాదేవి
భద్రాచలం , ఏప్రిల్ 30 (విజయ క్రాంతి) : శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం నందు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు 2025 ను మంత్రి వర్యులు , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రత్యక్ష పర్యవేక్షణలో భక్తుల సౌకర్యార్థమై అన్ని ఏర్పాట్లు చేసినట్లు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎల్ రమాదేవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, జిల్లా మంత్రులు, దేవాదాయ శాఖ మంత్రి,ఇతర అతిథులు విచ్చేయగా ఉత్సవాలు దిగ్విజయంగా నిర్వహించడం జరిగిందన్నారు.
స్వామివారి కళ్యాణం తదుపరి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ముత్యాల తలంబ్రాలు లభ్యత ననుసరించి అందజేసినట్లు తెలిపారు. కొంతమంది విలేకరులు కావాలని దురుద్దేశ్యంగా పూర్వకంగా దేవస్థానంపై తప్పుడు విమర్శలు చేస్తున్నారని, దేవస్థానం కీర్తి ప్రతిష్టలకే కాకుండా, అధికార యంత్రాంగంకు అపకీర్తి వచ్చే విధంగా జర్నలిజం విలువలను దిగజార్చు విధంగా ప్రవర్తిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దక్షిణ అయోధ్య గా ప్రసిద్ధిగాంచిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం భద్రాచలం యొక్క కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లకుండా గతంలో లాగా బాధ్యతగా వ్యవహరించి జర్నలిజం విలువలను పాటించవలసిందిగా ఆమె పాత్రికేయ మిత్రులకు విజ్ఞప్తి చేశారు.