calender_icon.png 17 September, 2025 | 7:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూలవిరాట్

30-06-2024 01:42:50 AM

అరణ్యవాసం వీడిన అర్జునుడిలా.. విరాట్ జూలు విదిల్చి విజృంభించిన వేళ.. టీమిండియా రెండోసారి ప్రపంచకప్ కైవసం చేసుకుంది. టోర్నీ ఆసాంతం కోహ్లీ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదని నిరాశ చెందిన అభిమానులకు.. తుదిపోరులో కింగ్ ఫుల్ మీల్స్ పెట్టాడు. సహచర ఆటగాళ్లు ఒక్కొక్కరే వెనుదిరుగుతున్న వేళ.. కోహ్లీ మొండిగా నిలబడ్డాడు. దశాబ్దాలుగా తనను మూలవిరాట్ ఎందుకంటున్నారో.. మరోసారి చాటిచెప్పాడు.

తన కోసమే ఆడుతాడు.. రికార్డుల కోసం పరితపిస్తాడు అనే విమర్శల మధ్య అత్యవసర పోరులో కీలక ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. తుదిపోరుకు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పిన మాటలను విరాట్ మైదానంలో నిజం చేసి చూపాడు. వనవాసంలో ఆయుధాలను జమ్మి చెట్టుమీద దాచిన పార్థుడు అవసరం వచ్చిన సమయంలో తన ధనస్సుతో దుష్టసంహారం చేసినట్లు.. అత్యవసర తరుణంలో కోహ్లీ తనలోని క్లాసిక్ గేమ్‌ను మరోసారి ప్రపంచానికి చాటాడు. గత టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై ఆశలే లేని స్థితిలో అద్వితీయ పోరాటంతో ఒంటిచేత్తో టీమిండియాను ఒడ్డున పడేసిన కోహ్లీ.. ఈ మ్యాచ్‌లోనూ దాదాపు అదే సీన్ రిపీట్ చేశాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన కోహ్లీ.. 19వ ఓవర్ ఐదో బంతికి వెనుదిరిగాడు.

టోర్నీ ఆసాంతం ఫామ్‌లేమితో ఇబ్బంది పడిన విరాట్.. అసలు సిసలు పోరులో కుమ్మేశాడు. జాన్సెన్ వేసిన తొలి ఓవర్‌లో కోహ్లీ మూడు ఫోర్లతో కదంతొక్కడంతో.. పొట్టి ప్రపంచకప్ ఫైనల్ తొలి పోరులో అత్యధిక (15) పరుగులు చేసిన జట్టుగా టీమిండియా నిలిచింది. ఇక ఈసారి పరుగుల వరద ఖాయమే అనుకొని అభిమానులు సంబరపడే లోపే.. మూడు బంతుల వ్యవధిలో రోహిత్, పంత్ వెనుదిరగగా.. కాసేపటికే సూర్యకుమార్ వారిని అనుసరించాడు. దీంతో రోహిత్ సేన 34/3తో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇంకేముంది మరోసారి నాకౌట్ మ్యాచ్‌లో భారత్ తడబడినట్లే అనుకుంటున్న సమయంలో నేనున్నానని విరాట్ పోరాడాడు.