భోజనం రుచికరంగా వండి పెట్టాలి
కాజీపేట, జూన్ 23 (విజయక్రాంతి): విద్యార్థులకు మధ్యాహ్న భోజనం నాణ్యతతో, రుచికరంగా వండి పెట్టాలని మధ్యాహ్న భోజన నిర్వాహకులకు కాజీపేట ఎంఈఓ మనోజ్ కుమార్ సూచించారు. కడిపికొండ ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాలను ఎంఈఓ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా పలు రికారడ్స్, రిజిస్టర్లు చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే తరగతిగది, విద్యా బోధనను పరిశీలించారు. విద్యార్థులను మధ్యాహ్న భోజనం గురించి అడిగి తెలుసుకున్నారు.
మధ్యాహ్న భోజనాన్ని రుచి చూశారు. మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం వడ్డించాలని, అలాగే వంట రుచికరంగా ఉండాలని మధ్యాహ్న భోజన కార్మికులకు సూచించారు. ఉపాధ్యాయులు రోజుకొకరు తప్పకుండా మధ్యాహ్న భోజనం రుచి చూసిన తర్వాతే పిల్లలకు వడ్డించాలని సూచించారు. ఎంఈఓ సందర్శన సమయంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు చుంచుకాల లింగారావు, జమీల బేగం, సుభద్ర మధ్యాహ్న భోజన కార్మికులు సుజాత,పద్మావతి,ఫాతిమా ఉన్నారు.






