సిగాచీ బాధితులకు పూర్తి నష్టపరిహారం చెల్లించాలి
జూన్ 30న బాధితులతో పాశమైలారం చౌరస్తాలో సంస్మరణ సభ
బీఆర్‌ఎస్ నేతలు ఆదర్శ్ రెడ్డి, శ్రీకాంత్ గౌడ్
పటాన్ చెరు, జూన్ 23: సిగాచీ పరిశ్రమలో జరిగిన ఘోర పేలుడు ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు నష్టపరిహారం పూర్తిస్థాయిలో చెల్లించాలని పటాన్ చెరు నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జ్ ఆదర్శ్ రెడ్డి, పటాన్ చెరు మాజీ జడ్పీటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్, ఇస్నాపూర్ చైర్మన్ శ్రీకాంత్ యాదవ్ డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఇస్నాపూర్ కౌన్సిలర్లు కూడా పాల్గొని బాధిత కుటుంబాలకు తమ మద్దతు తెలిపారు. జూన్ 30 నాటికి ఈ దుర్ఘటనకు ఏడాది పూర్తవుతున్నప్పటికీ బాధిత కుటుంబాలకు ఇప్పటివరకు పూర్తి స్థాయి నష్టపరిహారం అందలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన కోటి రూపాయల పరిహారం హామీ ఏడాది గడిచినా అమలు కాలేదని, కేవలం రూ.25 లక్షలు మాత్రమే అందించారని విమర్శించారు.
బాధిత కుటుంబాలకు న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, కార్మికుల కోసం పోరాడుతున్న వారిని విమర్శించడం తప్ప సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. దోషులను కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇప్పటివరకు ఒక్కరినే అరెస్టు చేశారని పేర్కొన్నారు. మంత్రి వివేక్ వెంకటస్వామి పరిహారం విషయంలో చెబుతున్న వివరాలపై స్పష్టత ఇవ్వాలని, బాధిత కుటుంబాలకు రావాల్సిన పూర్తి పరిహారం తక్షణమే అందించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం మానవత్వంతో స్పందించి బాధిత కుటుంబాలకు అండగా నిలవాలనిన్నారు. వారం రోజుల్లోగా పూర్తి పరిహారం చెల్లించకపోతే తీవ్ర ఉద్యమానికి దిగుతామని హెచ్చరించారు. హరీష్ రావు ఆదేశాల మేరకు జూన్ 30న సిగాచీ పరిశ్రమ పేలుడు బాధితులతో కలిసి సంస్మరణ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభలో మృతిచెందిన కార్మికులకు ఘన నివాళులు అర్పించడంతో పాటు, బాధిత కుటుంబాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు పేర్కొన్నారు.






