12 April, 2026 | 8:59 AM

మురిసిన నీలగిరి

08-12-2024 02:11 AM
  1. కాంగ్రెస్ విజయోత్సవ సభకు పోటెత్తిన జనం
  2. సీఎం రేవంత్‌రెడ్డి స్పీచ్‌కు కరతాళ హర్షం

నల్లగొండ, డిసెంబర్ 7 (విజయక్రాంతి): కాంగ్రెస్ పాలన ఏడాది పూర్తయి న సందర్భంగా నల్లగొండలో శనివారం నిర్వహించిన విజయోత్సవ సభ విజయవంతమైంది. నల్లగొండలోని గంధవారిగూడెం సమీపంలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు ఉమ్మడి జిల్లా నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, మహిళలు భారీగా తరలివచ్చారు.

సభలో రేవంత్‌రెడ్డి ప్రసంగం ఆధ్యంతం కాంగ్రెస్ శ్రేణులను ఉత్సాహ పరిచేలా సాగింది. పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో నల్లగొండ జిల్లాకు జరిగిన అన్యాయాన్ని సీఎం పూసగుచ్చినట్టు వివరించారు. పేదల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు, మహిళల అభ్యున్నతి కోసం రూపొందించిన పథకాలను ఏకరువు పెట్టగా సభకు వచ్చిన మహిళలు చప్పట్లతో హర్షం ప్రకటించారు.

ప్రతిపక్షాలపై సీఎం రేవంత్‌రెడ్డి తనదైన శైలిలో మండిపడగా కాంగ్రెస్ కార్యకర్తల ఈలలు, చప్పట్లతో సభా ప్రాంగణం హోరెత్తింది. మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తీరుపై విమర్శలు గుప్పించినప్పుడు పలువురు అభిమానులు డప్పులు మోగించి. బూరలు ఊది సంతోషం వ్యక్తంచేశారు.

ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా 3 వేల మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా సీఎం సభ విజయవంతంగా ముగియడంతో ఉన్నతాధి కారులు, పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.