16 April, 2026 | 12:20 AM

నగర పాలక సంస్థ విధులను పకడ్బందీగా నిర్వహించాలి

07-02-2026 12:00 AM

జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ఖమ్మం టౌన్, ఫిబ్రవరి 6 (విజయ క్రాంతి): నగరపాలక సంస్థ సిబ్బంది తమ విధులను పకడ్బందీగా నిర్వహించాలని, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి హెచ్చరించారు. జిల్లా కలెక్టర్, కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశం మందిరంలో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పని తీరుపై సంబంధిత అధికారులతో శుక్రవారం సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ నగరంలో పారిశుద్ధ్యం మరింత మెరుగు పడాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ కారణంగా కొంత మేర మంచి ఫలితాలు వచ్చాయని, మరొకసారి ఖమ్మం కార్పోరేషన్ పరిధిలో ప్రత్యేక పారిశుద్ధ్య నిర్వహణకు ప్రణాళిక తయారు చేయాలన్నారు.  చెత్త రవాణా వాహనాలకు జిపిఎస్, ఫ్యూయల్ సెన్సార్ తప్పనిసరిగా ఉండాలని అన్నారు. 

చెత్త వాహనాల మూవ్ మెంట్ రెగ్యులర్‌గా మానిటరింగ్ చేయాలని కలెక్టర్ తెలిపారు. వాహనాలకు అవసరమైన మరమ్మత్తులు ఉంటే వెంటనే చేయించాలని, పారిశుధ్య కార్మికుల హాజరు నమోదులో ఎఫ్.ఆర్.ఎస్. విధానం అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ లో భాగంగా నగరంలో కనీసం 1000 ఓపెన్ ప్లాట్ లను గుర్తించి అక్కడ పిచ్చి మొక్కలు తొలగించాలని, చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. 

నగరంలో మీడియన్ లను రెగ్యులర్ గా క్లీన్ చేయాలని,  డస్ట్ ఇబ్బంది రాకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. నగరంలో బ్రిడ్జి మీద ప్రచార హోర్డింగులు, పోస్టర్ లు అనుమతి లేకుండా పెట్టడానికి వీలు లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో అనుమతి లేకుండా ఉన్న హోర్డింగులు, పోస్టర్లను తొలగించాలని, మరొకసారి అనుమతి లేకుండా పబ్లిక్ ప్రదేశాలలో పోస్టర్లు అతికిస్తే భారీ జరిమానాలు విధించడంతో పాటు కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.

అభివృద్ధి పనులలో ఎటువంటి నిర్లక్ష్యం చేయవద్దని, పనుల పురోగతిపై ప్రతివారం నివేదిక అందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.మార్చి మొదటి వారం నాటికి ఫుట్ పాత్ పనులు పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. నగరంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పన్ను వసూలు కేవలం 32 శాతం మాత్రమే ఉందని, నోటీస్ లు జారీ చేసినప్పటికీ ఆస్తి పన్ను చెల్లించకపోతే వెంటనే సంబంధిత భవనాలపై రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకొని సీజ్ చేయాలన్నారు. 

ఈ సమావేశంలో ఖమ్మం మున్సిపల్ కమీషనర్ అభిషేక్ అగస్త్య, పబ్లిక్ హెల్త్ ఎస్‌ఇ రంజిత్, మునిసిపల్ ఇఇ కృష్ణలాల్, సహాయ మునిసిపల్ కమీషనర్ అనిల్ కుమార్, మునిసిపల్ ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, శానిటేషన్, సంబంధిత  అధికారులు, తదితరులు పాల్గొన్నారు.