27-11-2025 08:03:06 PM
జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్
గద్వాల (విజయక్రాంతి): గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి పోటీ చేసే అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ ఎలాంటి తప్పిదాలకు చోటులేకుండా సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ అన్నారు. గురువారం గద్వాల మండలం పూడూరు గ్రామంలోని, ధరూరు మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయాల వద్ద ఏర్పాటుచేసిన సర్పంచ్ ఎన్నికల నామినేషన్లను స్వీకరించు కేంద్రాలను కలెక్టర్ సందర్శించారు. పూడూరుతో పాటు ఎర్రవల్లి, మేలచెరువు, కొండపల్లి, రేపల్లె, ధరూర్ కేంద్రంలో ధరూర్ తో పాటు జాంపల్లి, దోర్నాల గ్రామ పంచాయతీలకు సంబంధించిన నామినేషన్లను కూడా స్వీకరిస్తుండడంతో ఆయా పంచాయతీల ఓటర్ లిస్టును పరిశీలించారు.
పోటీ చేయు అభ్యర్థులు పూరించాల్సిన వివిధ దరఖాస్తులను, నామినేషన్ వేసేందుకు అవసరమైన ఇతర సామాగ్రిని రిటర్నింగ్ అధికారులు సిద్ధంగా ఉంచుకోవడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయా పంచాయతీల కు ఖరారు చేసిన రిజర్వేషన్ల ప్రకారం సంబంధిత వర్గాల అభ్యర్థుల నుంచి నామినేషన్లు తీసుకోవాలన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచు, వార్డు సభ్యులు పదవులకు పోటీ చేయు అభ్యర్థులు తమ దరఖాస్తుకు జతపరచాల్సిన వయసు, కుల, ఇతరత్రా ధ్రువీకరణ పత్రాలను నిబంధనల ప్రకారం స్వీకరించాలన్నారు. పోటీ చేయు అభ్యర్థులు గ్రామ పంచాయితీకి చెల్లించాల్సిన పన్నులు పెండింగ్లో ఉండకుండా కట్టించుకోవాలన్నారు. నామినేషన్ల డిపాజిట్ స్వీకరించాక రసీదును అందజేయాలన్నారు.
నామినేషన్ వేసేందుకు వచ్చే అభ్యర్థితో పాటు ప్రతిపాదించే ఇద్దరినీ మాత్రమే కేంద్రంలోకి అనుమతించాలని, మిగతా వాళ్ళు కేంద్రానికి 100 మీటర్ల దూరంలో ఉండేలా చూడాలని ఆదేశించారు. సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ లో ఉండే అన్ని అంశాలను అభ్యర్థులు కరెక్టుగా పూరించేలా అవగాహన కల్పించాలన్నారు. ఆయా నామినేషన్ కేంద్రాల వద్ద హెల్ప్ డెస్క్లను పరిశీలించి పోటీ చేయు అభ్యర్థులకు అవసరమైన సలహాలను ఇవ్వాలని విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి సూచించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి పత్రాలను పోటీ చేయు అభ్యర్థులకు ఇవ్వాలని, అందులోని మార్గదర్శకాలు వారు క్షుణ్ణంగా అర్థం చేసుకొని పాటించేలా చూడాలన్నారు. పోటీ చేయు అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్ల మాదిరి సంతకాల నమూనా పత్రాలు, ఇతర రిజిస్టర్లు, సామాగ్రిని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్శనలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, జడ్పి డిప్యూటీ సీఈవో నాగేంద్రం, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.