27-11-2025 08:01:09 PM
ప్రారంభమైన నామినేషన్ల పర్వం..
కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య బిగ్ ఫైట్..
తాండూరు (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలో గ్రామ పంచాయతీల ఎన్నికల కోలాహలం నెలకొంది. నేటి నుండి నామినేషన్లు ప్రారంభం కావడంతో పలుచోట్ల ఆశావాహులు నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నేతృత్వంలో బలమున్న గెలుపు గుర్రాల ఎంపిక జరుగుతుంది. టిఆర్ఎస్ పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సర్పంచ్ అభ్యర్థుల ఎంపిక వారి విజయం తన భుజస్కందాలపై వేసుకొని ముందుకు సాగుతున్నారు. ఇక భారతీయ జనతా పార్టీ సైతం చాపకింద్రనీరుల ఆర్థిక, అంగ బలమున్న నాయకుల వేటలో పడింది. ప్రధానంగా మేజర్ గ్రామపంచాయతీలపై బీజేపీ పార్టీ కన్నేసినట్టు తెలుస్తుంది.
ఇలా మూడు పార్టీల మధ్య బిగ్ ఫైట్ కు గ్రామ పంచాయతీల ఎన్నికలు వేదిక కానున్నాయి. పెద్దముల్ మండలం బండమీదిపల్లి సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నత్తి కృష్ణ నామినేషన్ దాఖలు చేశారు. బషీరాబాద్ మండలం దామర్చేడ్ టిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా భారతి మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డితో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. రేపు నియోజకవర్గంలో ఉన్న పలు మేజర్ గ్రామపంచాయతీలో నామినేషన్లు భారీ స్థాయిలో దాఖలు అయ్యే అవకాశం ఉంది.