calender_icon.png 28 December, 2025 | 3:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నరేగా బచావో అభియాన్ 5 నుంచి దేశవ్యాప్త ఉద్యమం

28-12-2025 01:39:37 AM

  1. పేదల కడుపుకొట్టేందుకే ‘వీబీ  జీ రామ్ జీ’ కొత్తచట్టం
  2. కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలకు తాజా చట్టం ఉదాహరణ
  3. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే
  4. పెద్ద నోట్ల రద్దు తరహాలోనే జీ రామ్ జీ చట్టం: రాహుల్
  5. న్యూఢిల్లీ వేదికగా సీడబ్ల్యూసీ సమావేశం 

న్యూఢిల్లీ, డిసెంబర్ 27: భారత్‌లో రెండు దశాబ్దాలుగా అమలై గ్రామీణ ప్రాంత పేదల కు ఉపాధి కల్పించి, అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన మహాత్మాగాంధీ ఉపాధి పథకం(నరేగా) రద్దు నిర్ణయం సరికాదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. కేంద్ర ప్రభు త్వం పథకానికి మహాత్మాగాంధీ పేరు తొలగించడంపై ఆయన తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టం ‘వీబీ జీ రామ్ జీ’ని వ్యతిరేకిస్తూ జనవరి 5 నుంచి ‘నరేగా బచావో అభియాన్’ పేరిట కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త ఉద్యమానికి పిలుపునిస్తోందని స్పష్టం చేశారు.

న్యూఢిల్లీ వేదికగా శనివారం ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీతో కలిసి నిర్వహించిన సీడబ్ల్యూసీ సమావేశంలో కమిటీ ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఈ సందర్భంగా ఖర్గే ప్రసంగిస్తూ.. ఉపాధి పథకం.. కేవలం ఒక సాధారణ పథకం మాత్రమే కాదని, రాజ్యాంగం నిరుపేదలకు కల్పించిన హక్కు అని అభివర్ణించారు. పేదల కడుపుకొట్టేందుకే కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకువచ్చిందని ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయం వల్ల రాష్ట్రాలపై ఆర్థిక భారం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అఖిలపక్షాలతో ఎలాంటి సంప్రదిం పులు జరపకుండా కొత్తచట్టాలు తీసుకురావడం తగద ని హెచ్చరించారు. ప్రధాని మోదీ కనీసం తన మంత్రివర్గంతోనైనా చర్చించకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. పేదలకు ఆర్థిక భరోసానిస్తూ..అన్నం పెట్టిన పథకాన్ని రద్దు చేస్తే వారు చూస్తూ ఊరుకోర ని హెచ్చరించారు. 

కొత్త చట్టం వల్ల రాష్ట్రాలపై అదనపు ఆర్థిక భారం పడుతుందన్నారు. గతంలో వేతనాల ఖర్చును పూర్తిగా కేంద్రమే భరించేదని, ఇప్పుడు రాష్ట్రాలు కూడా భాగస్వామ్యం పంచుకోవాల్సి వస్తోందన్నారు. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నదని ఆరోపించారు.

పెద్ద నోట్ల రద్దు తరహాలోనే కేంద్ర ప్రభు త్వం ‘నరేగా’ చట్టాన్ని తీసుకువచ్చిందని ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ విమర్శించారు. కొత్త చట్టం రాష్ట్రాలపై మోయలేని ఆర్థిక భారం మోపేలా ఉందని మండిపడ్డారు. నిరుపేదలకు నష్టం కలిగించే విధంగా కేంద్ర ప్రభుత్వం చట్టానికి రూపకల్పన చేసిందని ధ్వజమెత్తారు. ఉపాధి హామీ పథకం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, అలాంటి ప్రతిష్ఠాత్మకమైన పథకాన్ని నీరుగార్చేందుకే కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చిందని నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వం తక్షణం కొత్త చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రధాని మోదీ తన మంత్రివర్గం, అఖిలపక్షాన్ని సంప్రదించకుండా ఈ నిర్ణయం తీసుకున్నారని, కేంద్రంలో ఏకవ్యక్తి పాలన (వన్  మ్యాన్ షో) నడుస్తున్నదనడానికి వీబీ జీ రామ్ జీ చట్టమే ఉదాహరణ అని పేర్కొన్నారు. మోదీ ఏది కోరుకుంటే అది దేశంలో అమలు చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ విధానాలను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోందని, దీనిలో భాగంగానే దేశవ్యాప్త ఉద్యమానికి పిలుపునిస్తోందని వెల్లడించారు. కేంద్రప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలకు వ్యతిరేకంగా జనవరి 5 నుంచి దేశవ్యాప్త పోరాటానికి శ్రీకారం చుడుతున్నామని స్పష్టం చేశారు. 

పలు కీలక అంశాలపై చర్చ

ఖర్గే, రాహుల్‌గాంధీతోపాటు ఏఐసీసీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ, కాం గ్రెస్ ఎంపీ శశిథరూర్ సహా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్న ఈ సమావేశంలో కమిటీ సభ్యులు పలు కీలక అంశా లపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వం ఆరావళి పర్వత శ్రేణుల నిర్వచనాన్ని మార్చడం, అక్కడ అక్రమ మైనింగ్, బంగ్లాదేశ్‌లో హిం దువులపై దాడులపై సుదీర్ఘంగా చర్చించారు.

అలాగే నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులను ఎదు ర్కొనేందుకు అనుసరించాల్సిన ఎత్తుగడలపైనా చర్చ సాగినట్లు తెలుస్తోంది. అలాగే కర్ణాటకలో సీఎం మార్పు అంశంపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. వచ్చే ఏడాది వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున, అనుసరించాల్సిన వ్యూహాలపై అగ్ర నేతలు దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది.