28-12-2025 01:26:52 AM
డిసెంబర్ 25.. దేశవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలను ప్రజలు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య సంతోషంగా జరుపుకుంటున్నారు. తమ మొబైల్ ఫోన్ల నుంచి తమకు నచ్చిన ఫుడ్ ఐటమ్స్ ఆర్డర్ పెట్టుకున్నారు. గంట వేచి చూసినప్పటికీ ఎంతకూ ఫుడ్ ఆర్డర్‌లు రాక పోవడంతో జనాలకు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. దీంతో ఆయా ఫుడ్ డెలివరీ యాజమాన్యాలకు ఫోన్లు చేసి అడిగితే అవతలి వైపు నుంచి ‘అదిగో డెలివరీ.. ఇదిగో డెలివరీ’ అంటూ కాలాయాపన చేశాయి. కానీ ఫుడ్ ఆర్డర్లు మాత్రం డెలివరీ కాలేదు. ఎందుకీ పరిస్థితి అని ఆరా తీస్తే ఫుడ్ డెలివరీ చేయాల్సిన గిగ్ వర్కర్లు తమ సమస్యలు, డిమాండ్లను నెర వేర్చాలంటూ మెరుపు సమ్మెకు దిగారన్న విషయం బయటకు వచ్చింది.
హైదరాబాద్, డిసెంబర్ 27 (విజయక్రాంతి): తమ సమస్యలను పరిష్కరించా లని, డిమాండ్లు నెరవేర్చాలని క్రిస్మస్ పర్వదినానా స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫామ్‌లకు డెలివరీ రైడర్లుగా పనిచేసే వేలాది మంది గిగ్ వర్కర్లు దేశవ్యాప్తంగా మెరుపు సమ్మె చేశారు. ఎన్నో రోజులుగా తమ సమస్యలు పట్టించుకోవాలని యాజమాన్యాలకు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ వారిలో ఇసుమంతైనా చలనం లేకపోవడం తో తమ సేవలు నిలిచిపోతే ఎలా ఉంటుం దో యాజమాన్యాలకు అర్థం కావాలని గిగ్ వర్కర్ల యూనియన్లు సమ్మె చేయాలన్న నిర్ణయానికి వచ్చాయి.
మాములు రోజుల్లో అయితే పెద్దగా ప్రభావం ఉండడం లేదని.. క్రిస్మస్ పండుగను టార్గెట్ చేసుకున్న గిగ్ వర్కర్ల యూనియన్లు తమ డిమాండ్ల సాధన నెరవేర్చాలంటూ మెరుపు సమ్మెకు దిగడం తో దేశమంతా ఆన్‌లైన్ డెలివరీ సేవలు స్తం భించిపోయాయి. పైగా పండుగ రోజు కావ డం, వేలాది సంఖ్యలో ఆర్డర్లు డెలివరీ చే యాల్సి ఉండటంతో యాజమాన్యాలు దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి.
ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ (ఐఎఫ్‌ఏటీ), తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (టీజీపీడబ్యూయూ) సహా వివిధ రాష్ట్రాల్లోని ఆయా గిగ్ వర్కర్ల యూనియన్లు పిలుపుతో దాదాపు 40 వేల మంది కార్మికులు మెరుపు సమ్మెలో పాల్గొన్నారు. దీని ఫలితంగా దేశ రాజధాని ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతం, బెంగళూరు, ముంబై, గురుగ్రామ్, పట్నా సహా మిగిలిన ప్రధాన నగరాల్లోనూ 50 నుంచి 60 శాతం ఆర్డర్స్‌లో అంతరాయాలు ఏర్పడ్డాయి. కాగా గిగ్ వర్కర్ల సమ్మె ప్రభావం తెలంగాణలోనూ స్పష్టంగా కనిపించింది.
ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌లో గిగ్ వర్కర్లంతా ఒకచోట చేరి ర్యాలీలు తీయడంతో ఫుడ్, వాణిజ్య పరమైన డెలివరీల్లో తీవ్ర జాప్యం నెలకొంది. అయితే చాలా వరకు గిగ్ వర్కర్లు సమ్మెలో పాల్గొనడంతో డెలివరీ యాజమాన్యాలు సమ్మెలో పాల్గొనని కార్మికులకు అదనపు ప్రోత్సాహకాలు ఇచ్చి ఉన్నపళం గా ఆర్డర్లను డెలివరీ చేసే ప్రయత్నం చేశాయి. ఆర్డర్స్ ఎక్కువగా ఉండే సాయంత్రం, రాత్రి సమయాల్లో ఆర్డర్లను డెలివరీ చేయడంలో యాజమాన్యాలు విఫలమయ్యాయి. దీంతో గిగ్ వర్కర్ల మెరుపు సమ్మె ఒక్కసారిగా దేశం దృష్టిని ఆకర్షించింది. ఇది శాంపిల్ మాత్రమేనని.. రానున్న డిసెంబర్ 31న రెండోసారి సమ్మె చేపట్టనున్నట్లు ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ (ఐఎఫ్‌ఏటీ) యూనియన్ స్పష్టం చేసింది.
యువతే అధికం..
చివరగా గిగ్ వర్కర్లలో ఈ తరం యువతే (జెన్ జీ) అధికంగా ఉండడం కలవరపాటుకు గురిచేసే అంశం. డిగ్రీ, పీజీ లాంటి ఉన్నత చదువులు చదవినప్పటికీ నిరుద్యోగం కారణంగా ఆర్థిక సమస్యలు చుట్టుముడుతుండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో డెలివరీ బాయ్స్‌గా సేవలందిస్తు న్నారు. ముఖ్యంగా నగరాల్లో ఫుడ్ ఆర్డర్‌లు, వాణిజ్య పరమైన ఆర్డర్లు ఎక్కువగా ఎగువ మధ్యతరగతి, ఉన్నత సంపన్న వర్గాలు చేస్తుంటాయి. అయితే విద్యావంతులైన డెలివరీ బాయ్స్.. మధ్యతరగతి, సంపన్న కస్టమర్లకు డెలివరీలు చేస్తూ వారితో మాటమంతీ కలుపుతూ తమ బాధలు పంచుకుంటున్నారు.
చదివిన చదువుకు, చేస్తున్న పనికి సంబంధం లేకుండా పోతుందని వారు వాపోతున్నారు. సెంటర్ ఫర్ లేబర్ రీసెర్చ్ 2025 సర్వేలో గిగ్ కార్మికుల్లో బ్యాచిలర్ డిగ్రీ కలిగిన వారు 65 శాతం ఉండడం గమనార్హం. అయినప్పటికీ సగటున నెలకు రూ. 20వేల కంటే తక్కువ సంపాదిస్తున్నారని అని పేర్కొంది. అంతేకాదు 15 నుంచి 29 ఏళ్ల వయసు ఉన్న 17 శాతం మందిలో సరైన ఉపాధి లేక వ్యవస్థపై , మార్కెట్‌పై అసహనం పెరిగిపోయి ఏదో ఒక పని చేసుకుంటూ బతుకుతున్నారని తమ అధ్యయనంలో పేర్కొంది. సంపన్న వర్గాలను రోజు గమనిస్తుండటం వల్ల ఆర్థిక అంతరాల విషయంలో గిగ్ వర్కర్లకు అంతకంతకూ ఆసహనం ఎక్కువ అవుతుంది. ఇది ఏవైపునకు దారితీస్తోందోనని సామాజికవేత్తలు అంటున్నారు.
అసలెందుకీ సమ్మె?
దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లు మెరుపు సమ్మెకు దిగడానికి కారణాలు చాలానే ఉన్నాయి. ఆయా కంపెనీలు కార్మికులకు న్యాయమైన వేతనాలు, భద్రత, గౌరవం సామాజిక భద్రతను కల్పించడం లేదని గిగ్ వర్కర్ల యూనియన్లు ఆరోపిస్తున్నాయి. ఎక్కువ పని గంటలు, ప్రమాదంతో కూడుకున్న హై డెలివరీ, డిమాండ్ ఉన్న సమయాల్లో కార్మికులకు ప్రాథమిక రక్షణ వ్యవస్థ కరువు అవుతుందని పేర్కొన్నాయి.
ముఖ్యంగా పది నిమిషాల్లో డెలివరీ సర్వీసులతో కార్మికుల్లో ఒత్తిడి పెరిగిపోతుంది. ఇది తమ ప్రాణాలను ప్రమాదంలో పడేస్తుందని కార్మికులు చెబుతున్నారు. గిగ్ వర్కర్లను కార్మికులుగా గుర్తించి, వారికి పీఎఫ్ , ఈఎస్‌ఐ వంటి సామాజిక భద్రతా ప్రయోజనాలను కల్పించాలని వారు కోరుతున్నారు. పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా డెలివరీ ఛార్జీలను పెంచాలని , ప్రతి ఆర్డర్‌పై గౌరవప్రదమైన ఆదాయం కల్పించాలని యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి.
పని చేసే సమయంలో డెలివరీ బాయ్స్‌కు భద్రతను కల్పించాలని, సమగ్ర ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, కంపెనీల ఏకపక్ష నిర్ణయాలను అరికట్టేందుకు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు కఠినమైన నిబంధనలను అమలు చేయాలని యూనియన్లు కోరుతున్నాయి. పని పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయని, కంపెనీలు కేవలం లాభాలకే ప్రాధాన్యత ఇస్తూ వర్కర్ల సంక్షేమాన్ని విస్మరిస్తున్నాయని యూనియన్ నేతలు విమర్శించారు. సమస్యలపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి, కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీని సమర్థవంతంగా అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.
గిగ్ ఎకానమీలో పనిచేస్తున్న లక్షలాది మంది భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్లాట్‌ఫామ్ కంపెనీలపై ఒత్తిడి తీసుకురావాలని వారు కోరుతున్నారు. ఒకవేళ తమ డిమాండ్లు, సమస్యలు పరిష్కరించని నేపథ్యంలో తదనంతర పరిణామాలకు యాజమాన్యాలు సిద్ధంగా ఉండాలని యూనియన్లు పరోక్షంగా హెచ్చరించాయి. డిసెంబర్ 31న రెండోసారి సమ్మె చేయాలని గిగ్ వర్కర్ల యూనియన్లు నిర్ణయం తీసుకున్న వేళ.. వినియోగదారులు తమ ఆర్డర్ల విషయంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఆయా డెలివరీ యాజమాన్యాలు ఇప్పటికే సూచించాయి.
ప్రధాన డిమాండ్లు..
1) పారదర్శకమైన , న్యాయమైన వేతనం
2) ‘10 నిమిషాల డెలివరీ’ మోడల్‌ను విత్‌డ్రా చేయాలి.
3) సరైన ప్రాసెస్ లేకుండా అకౌంట్ బ్లాకింగ్ చేయకూడదు
4) మంచి సేఫ్టీ సామగ్రి, ప్రమాద బీమా కల్పించడం
5) అల్గారిథమిక్ వివక్షత లేకుండా హామీ ఇవ్వబడిన పని కేటాయింపు
దీనితో పాటు బలమైన యాప్, టెక్నికల్ సపోర్ట్‌తో పాటు పేమెంట్స్ ఫెల్యూర్,జాబ్ సెక్యూరిటీ వంటి సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ ఏర్పాటు చేయాలి. హెల్త్ ఇన్సూరెన్స్,యాక్సిడెంట్ కవరేజీ, పెన్షన్ బెనిఫిట్స్ అందించాలని గిగ్ వర్కర్స్ డిమాండ్ చేస్తున్నారు. అయితే గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొత్త లేబర్ కోడ్‌లో కొన్ని నిబంధనలు పొందుపరిచింది. ఈ నేపథ్యంలో గిగ్ వర్కర్లు సమ్మెకు దిగారు.
కొత్త లేబర్ కోడ్ ప్రకారం అగ్రిగేటర్లు తమ వార్షిక టర్నోవర్‌లో 1 నుండి 2 శాతం (కార్మికులకు చెల్లించే మొత్తంలో 5 శాతం వరకు ) సామాజిక భద్రత నిధికి కేటాయించడం తప్పనిసరిచేసింది. దీనితో పాటు వారికి ఆరోగ్య, ప్రమాద బీమా కల్పించాలి. అయితే కొత్త లేబర్ కోడ్‌లోని నిబంధనలను అమలు చేస్తామని స్విగ్గీ, జొమాటో కంపెనీలు పేర్కొన్నాయి.