3 July, 2026 | 1:19 AM

గురుకులాల్లో సీట్ల సంఖ్య పెంచాలి

03-07-2026 12:30 AM

మహబూబాబాద్, జూలై 2 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో అన్ని గురుకుల పాఠశాలలో సీట్ల సంఖ్యను పెంచాలని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల ఆర్ .సి. ఓ  రత్నకుమారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి వెలుగు శ్రావణ్, జిల్లా అధ్యక్షులు మాగం లోకేష్  మాట్లాడుతూ  మహబూబాబాద్ జిల్లా పూర్తిగా నిరుపేద పేద, మధ్య తరగతి వర్గాలు ఎక్కువగా నివసించే ప్రాంతమని, ఈ ప్రాంతంలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల అధిక ఫీజుల దోపిడీని తట్టుకోలేక , ఉదయాన్నే పనులకు వెళ్లి రాత్రి వేళల్లో తిరిగి వచ్చే ఎంతోమంది శ్రామికులు తమ పిల్లలను గురుకుల పాఠశాలల్లో చదివించాలని కోరుకుంటున్నారన్నారు.

ఇటువంటి తరుణంలో  జిల్లాలో ఉన్న గురుకుల పాఠశాలల్లో చాలా తక్కువ సంఖ్యలో ప్రభుత్వం సీట్లు కేటాయించిందని, దీనితో చాలా మంది విద్యార్థులు సీట్లు రాక ప్రైవేట్ పాఠశాలలలో ఫీజులు కట్టలేక ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారని, వెంటనే గురుకుల పాఠశాలలో సీట్ల సంఖ్యను పెంచాలని, తద్వారా విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి మేక వెంకటేష్, పట్టణ కార్యదర్శి చిలువేరు వికాస్, ముఖేష్, చారి, ప్రశాంత్ పాల్గొన్నారు.