21 August, 2026 | 2:35 AM

నేరనియంత్రణ కేసుల దర్యాప్తులో వేగం పెంచాలి

21-08-2026 01:39 AM

భూత్పూర్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ డి.జానకి 

భూత్పూర్, ఆగస్టు 20: పోలీస్ స్టేషన్ల పనితీరు, కేసుల దర్యాప్తు పురోగతి నేర నియంత్రణ చర్యలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ప్రజలకు మరింత సమర్థవంతమైన పోలీస్ సేవలు అందించేందుకు అధికారులు కృషి చేయాలని జిల్లా ఎస్పీ  జానకి సూచించారు.

గురువారం భూత్పూర్ సర్కిల్ కార్యాలయాన్ని వార్షిక తనిఖీలో భాగంగాఎస్పీ పరిశీలించి సర్కిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్ల పనితీరు, నేరాల పరిస్థితి, కేసుల దర్యాప్తు తదితర అంశాలను సమీక్షించారు. ఇన్స్పెక్టర్ స్థాయిలో దర్యాప్తు చేస్తున్న కేసులను పెండింగ్లో ఉంచకుండా త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి, నాణ్యమైన ఆధారాలతో కేసులను కోర్టులో సమర్థవంతంగా నిరూపించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రతి కేసు దర్యాప్తు పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని తెలిపారు.

సర్కిల్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల SHOలతో క్రమం తప్పకుండా నేర సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ, ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదవుతున్న నేరాలపై విశ్లేషణ చేయాలని సూచించారు. నేరాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టడంతో పాటు పాత నేరస్తులు, రౌడీషీటర్లు, అనుమానితుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారుల సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని, బాధితుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ వారి ఫిర్యాదులపై సత్వరమే స్పందించాలని జిల్లా ఎస్పీ సూచించారు.

ప్రజలకు పోలీసులపై నమ్మకం మరింత పెరిగేలా బాధ్యతాయుతమైన, ప్రజా అనుకూల పోలీసింగ్ను కొనసాగించాలని తెలిపారు. మహిళలు, బాలల భద్రత, సైబర్ నేరాల నియంత్రణ, మాదకద్రవ్యాల నివారణ, రోడ్డు ప్రమాదాల నియంత్రణ తదితర అంశాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. జాతీయ రహదారులపై ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి, సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ వార్షిక తనిఖీలో భూత్పూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, భూత్పూర్ సబ్ ఇన్స్పెక్టర్ నాగన్న, భూత్పూర్ సబ్ ఇన్స్పెక్టర్-2 విద్యా రెడ్డి తో పాటు ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.