12-05-2025 02:41:07 AM
స్థలాన్ని కాపాడుతా : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
ఎల్బీనగర్, మే 11 : మన్సూరాబాద్ డివిజన్ లోని హిమపురి కాలనీలో ఉన్న పార్కు స్థలాన్ని కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి కబ్జా చేశారని, ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని స్థానికులు ఆదివారం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డినో కోరారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆదివారం మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని హిమపురి కాలనీవాసులు నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ...
హిమపురి కాలనీలో ఉన్న పార్కు స్థలం కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి సహకారంతో కబ్జాకు గురైందని ఆరోపించారు. పార్కును రక్షించాలని ఎమ్మెల్యేను కోరారు. పార్కు విషయంపై ఇప్పటికే జీహెచ్‌ఎంసీ, హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. జడ్జెస్ కాలనీ సంఘం అధ్యక్షుడు అంజయ్య గౌడ్ మాట్లాడుతూ.. హరిపురి కాలనీ పార్కు కబ్జా చేశారని, దీని వెనక కార్పొరేటర్ మనుషుల హస్తముందని ఆరోపించారు. అనంతరం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ... న్యాయం మనవైపే ఉందని, ఎవరూ భయాందోళనకు గురి కావద్దన్నారు.
పార్కు కబ్జా విషయంపై త్వరలోనే జీహెచ్‌ఎంసీ కమిషనర్, ఇతర అధికారులను కలిసి పార్కును కాపాడుతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్ రెడ్డి, బీఆర్‌ఎస్ డివిజన్ అధ్యక్షుడు జక్కిడి మల్లారెడ్డి, నాయకులు జగదీశ్ యాదవ్, టంగుటూరి నాగరాజు,జక్కిడి రఘువీర్ రెడ్డి, కాలనీవాసులు అధ్యక్షుడు సత్యనారాయణ, సభ్యులు గోపీకృష్ణ రెడ్డి, బద్రీ, రవికిరణ్, సత్యనారాయణ రెడ్డి, దత్తం రెడ్డి, సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.