09-11-2025 01:52:30 AM
గుట్టు చప్పుడు కాకుండా రాత్రికి రాత్రే తరలింపు
ఉన్నతాధికారులకు ఫిర్యాదు.. కొనసాగుతున్న విచారణ?
నాగర్‌కర్నూల్, నవంబర్ 8 (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లా పోలీసులు కక్కుర్తిని ప్రదర్శించారు. కంచె చేను మేసిన చందంగా తప్పు చేసే వారిని, దొంగలను పట్టుకోవాల్సిన ఖాకీలే డబ్బులకు కక్కుర్తి పడి పోలీసు శాఖకు చెందిన చెందినవిలువైన టేకు కలపను గుట్టు చప్పుడు కాకుండా రాత్రికి రాత్రే మాయం చేశారు. జిల్లా కేంద్రంలోని ఓ పాత గది ఊరుతోందని గత కొన్ని నెలల క్రితం మరమ్మతు చేపట్టారు.
ఈ క్రమంలో సుమారు రూ.10 లక్షల విలువ చేసే పురాతన భారీ టేకు దూలాలు తొలగించి రేకుల సహాయంతో పైకప్పు వేశారు. వేలం వేయాల్సిన వాటిని అక్కడే ఉన్న ఇంటీరియల్ షటిల్ కోర్టులో భద్రపర్చారు. కాగా వాటిని గత నెల 20న పోలీసు సిబ్బందిని తరలించే డీసీఎం వాహనంలోనే రాత్రుళ్ల సమయంలో కొల్లాపూర్ ప్రాంతానికి తరలించారు.
విషయం కాస్త ఉన్నతాధికారుల చెవిలో పడటంతో విచారణ కమిటీ ద్వారా అంతర్గత విచారణ జరిపిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. కాగా విచారణ జరిపే క్రమంలోనూ చేతివాటం ప్రదర్శించిన వారి తో లాలూచీ పడుతున్నట్లు తెలుస్తోంది. కలపను తరలించిన వ్యవహారంలో ఓఎస్‌ఐ ప్రధాన పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.