23-01-2026 12:37:13 AM
జనరల్ స్థానంలో చైర్మన్ పీఠంపై కన్ను
పార్టీలు మారుతున్న నేతలు!
శంకర్ పల్లి, జనవరి 22( విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు కావడంతో శంకర్ పల్లిలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. చైర్మన్ స్థానం జనరల్ కేటాయించడంతో ఆశావాహుల సంఖ్య భారీగా పెరిగింది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలు గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. వార్డు లో పోటీ చేసేందుకు పార్టీ టికెట్ ఆశించి దక్కని నాయకులు ఇతర పార్టీల బాట పడుతున్నారు. తాజాగా కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్ శ్రీనాథ్ గౌడ్, మాజీ ఉప సర్పంచ్ దండు సంతోష్ తమ అనుచరులతో కలిసి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. బీజేపీ నుంచి కూడా వలసలు కొనసాగుతున్నాయి.
రిజర్వేషన్ల ఎఫెక్ట్..
మొత్తం 15 వార్డుల్లో 3 బీసీలకు, 3 ఎస్సీలకు, 1 ఎస్టీకి కేటాయించగా మిగిలినవి జనరల్ స్థానాలుగా ఉన్నాయి. ఆశించిన వార్డు రిజర్వ్ కావడంతో కొందరు నేతలు పక్క వార్డుల వైపు చూపు చూస్తున్నారు. మాజీ చైర్మన్ సాత విజయలక్ష్మి భర్త ప్రవీణ్ కుమార్ మళ్ళీ 15వ వార్డు నుండే పోటీకి సిద్ధమవుతున్నారు. ఒకే వార్డులో అత్యంత సన్నిహితులు, మిత్రులు, బంధువులు వేర్వేరు పార్టీల నుండి పోటీ పడాల్సి రావడంతో ‘నువ్వా-నేనా‘ అనే ఉత్కంఠ నెలకొంది. ఓట్ల విభజనపై నేతలు తలమునకలవుతున్నారు.
ఖర్చుకు వెనకాడని నేతలు..
చైర్మన్ పీఠం కోసం బలమైన పోటీ నెలకొంది. ఆర్థికంగా బలంగా ఉన్న వారికే టికెట్లు ఇచ్చే యోచనలో పార్టీలు ఉండగా, కొందరు నాయకులు ఎన్నికల ఖర్చు కోసం ఆస్తులు అమ్ముకోవడానికి కూడా వెనకాడటం లేదు. మొత్తానికి శంకర్ పల్లి పుర పోరు ఒక రణరంగాన్ని తలపిస్తోంది. ద్వితీయ మున్సిపల్ ఎన్నికల్లో పట్టణ ప్రజలు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాలి.