23-01-2026 12:34:57 AM
జనగణన తర్వాతేనని కోర్టుకు తెలిపిన కేంద్రం
నియోజకవర్గాలు పెరుగుతాయన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
మంత్రి ప్రకటనతో జిల్లాలో తీవ్ర చర్చ
ఆశావహుల్లో ఉత్సాహం
మేడ్చల్, జనవరి 22 (విజయక్రాంతి): అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన అంశం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని, మేడ్చల్ మూడు అసెంబ్లీ నియోజకవర్గాలుగా విడిపోతుందని మంత్రి వెంకటరెడ్డి ప్రకటించడంతో జిల్లాలో కొత్త వాటిపై తీవ్ర చర్చ జరుగుతోంది. 2028 వరకు నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందో లేదోనని అనుమానాలు వెలువడుతున్న వేళ మంత్రి వెంకట్ రెడ్డి దీనిపై క్లారిటీ ఇచ్చారు.
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మేడ్చల్ జిల్లా అలియాబాద్ లో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సన్నాహక సమావేశానికి పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జి, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. వచ్చే ఎన్నికల నాటికి మేడ్చల్ మూడు నియోజకవర్గాలుగా ఏర్పడుతుందని అనడమే గాక, రాష్ట్రంలో 153 అసెంబ్లీ నియోజకవర్గాలలో 125 గెలుపొందుతామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. పునర్విభజన జరిగితే 153 కు పెరుగుతాయి. మంత్రికి పక్కా సమాచారం ఉండడం వల్లే క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఆశావహుల్లో ఉత్సాహం
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటనతో ఆశావహులు ఉత్సాహపడుతున్నారు. తమకు పోటీ చేసే అవకాశం దక్కుతుందని జిల్లాలోని వివిధ నియోజకవర్గాలకు చెందిన నాయకులు భావిస్తున్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో సుమారు 7 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. మేడ్చల్ నియోజకవర్గం మూడుగా విడిపోతే తమ నియోజకవర్గంలోనూ మూడు ఏర్పడుతాయని కుతుబు ల్లాపూర్ నాయకులు భావిస్తున్నారు. మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి నియోజక వర్గాలలోనూ కొత్తవి ఏర్పడనున్నాయి.
పునర్విభజనపై సందేహాలు
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని ప్రకటించగా, మరికొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి మహిళా బిల్లు ఆమోదించిన సందర్భంలో నియోజకవర్గాల పునర్విభజన చేసి మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించారు. జనాభా గణన ఉన్నందున 2028 అసెంబ్లీ, 2029 పార్లమెంట్ ఎన్నికల వరకు పునర్విభజన పూర్తి కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. 2001లో చేసిన 84 రాజ్యాంగ సవరణలో 2026 తర్వాత చేపట్టే జనగణన ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరగాలని అందులో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం 2014 లోని సెక్షన్ 28 (1) ప్రకారం తెలంగాణలో 153 కు, ఆంధ్రప్రదేశ్లో 225 కు పెంచుకునే వెసులబాటు కల్పించారు.
దీని ప్రకారం వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు సీట్లు పెరుగుతాయని భావించారు. సుప్రీంకోర్టులో నియోజకవర్గాల పునర్విభజన విషయమై పిటిషన్ దాఖలు అయింది. జన గణన తర్వాతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో పునర్విభజన ఉంటుందని కేంద్రం కోర్టుకు తెలిపింది. జనగణన పూర్తయ్యే వరకు నియోజకవర్గాల పునర్విభజన ఉండబోదని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం 2027 జూన్ 4న జనగణనకు షెడ్యూల్ ప్రకటించింది. జనగణనకు చాలా సమయం పడుతుందని 2029 ఎన్నికల వరకు పూర్తి కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. 2029 వరకు జనగణన పూర్తి చేసి పునర్విభజన ప్రక్రియ పూర్తి అవుతుందో, ప్రస్తుత నియోజకవర్గాల ఆధారంగానే ఎన్నికలు జరుగుతాయో వేచి చూడాల్సిందే!