29-08-2025 04:15:53 AM
అదిలాబాద్, ఆగస్టు 28 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లాలో మళ్లీ భారీ వర్షాలు అటు ప్రజలను ఇటు అన్నదాతలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. బుధవారం నుం డి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో వరద ఉధృతి పెరిగి వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. జిల్లా కేంద్రంలోని పలు కాలనీ లోని లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా జిల్లాలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
వరద ఉధృతితో పలు వాగు లు ఉగ్రరూపాన్ని దాల్చడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు వర్షాలపై ఆరా తీశారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షాతో వీడియో కాల్ మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అటు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పలులోతట్టు ప్రాంతాల్లో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పర్యటించారు. ఓం బిర్లా కాలనీలో ఉధృతికి కోతకు గురైన రోడ్డును పరిశీలించి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ముఖ్యంగా జైనథ్ మండలంలో 110.0 ఎంఎం వర్షపాతం నమోదయ్యింది. దీంతో ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉట్నూర్ మండలం లోని ఎంక కాలనీ సమీపంలోని వాగు ఉధృతిగా ప్రవహించడంతో వ్యవసాయ పనులకు వెళ్లిన దంపతులు ప్రహల్లాద్, శకుంతల వాగు కు అటువైపుగా చిక్కుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘట న స్థలానికి చేరుకొని తాడు సహాయంతో దంపతులనుసురక్షితంగా వాగు దాటించారు.
అలాగే ఉట్నూర్ మండలంలోని లక్షెట్టిపేట్ వాగు వంతెనపై నుంచి వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అటువైపుగా వెళ్లే లక్షేట్ పెట్, చిన్నూగూడ, కామయి పెట్, బొప్పరి కుంట, మత్తడి గూడ, పాట గూడ, రాజుల గూడ, వంక తుమ్మ, రాజాం పెట్ గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అదేవిధంగా తలమడుగు మండలం లోని దేవాపూర్ వాగు వంతెనపై నుంచి వర ద పొంగి ప్రవహిస్తోంది.
గ్రామానికి చెందిన కొందరు పంట చేసుకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగులో నుం చి గ్రామస్థులు వాగు దాటి వెళ్లారు. ఒక వైపు పోలీసులు, కలెక్టర్ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నా కొందరు ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా మండలంలోని ఖోడద్ గ్రామంలో భారీ వర్షాలకు ఇళ్ల లోకి వరద నీరు చేరాయి. దింతో గ్రామస్తులు అంతర్ రాష్ట్ర రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. దీంతో తీవ్ర ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడింది. ఎన్.ఐ రాధిక ఘటన స్థలానికి చేరుకొని ప్రజలతో మాట్లాడి సమస్యను పరిష్కరించేలా చూస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
ఉమ్మడి జైనథ్ మండలంలోని తర్నం వాగపై ఉన్న లోలేవల్ వంతెనపై వరదనీరు ఉప్పొంగి ప్రవహించడంతో జైనథ్, బేలా మండలాలతో పాటు మహారాష్ట్ర వాసులకు రాకపోకలు నిలిచిపోయాయి. దింతో తర్నం వాగు ఉధృతిని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పరిశీలించారు. వరద ఉధృతికిలో లెవెల్ వం తెన పై చిక్కుకుని ప్రాణాలతో బయటపడ్డ లారీ డ్రైవర్‌తో ఎమ్మెల్యే పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
అదేవిధంగా బోథ్ నియోజకవర్గంలో సైతం గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపద్యంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ విస్తృతంగా పర్యటించారు. నేరెడిగొండ మండలంలోని వాంకిడి వాగులను, చెక్ డ్యాం లను బోథ్ పరిశీలించారు. అత్యంత భారీ వర్షాల కారణంగా నియోజకవర్గ ప్రజలెవరు బయటకు రావొద్దని, వాగు వంకలకై ఎవరు వెళ్ళొద్దని అత్యవసరమైతే తప్ప బయట వెళ్ళొద్దని సూచించారు. మరోవైపు జిల్లాలోని సాత్నాల ప్రాజెక్ట్, మత్తడి వాగు ప్రాజెక్టుకు వరద ఉధృతి పోటెత్తింది. దీంతో అధికారులు సాత్నాల ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తి, మత్తడి వాగు ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేశారు.
సీఐ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు..
ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి జైనథ్ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జైనథ్ సీఐ సాయినాథ్, వాహన డ్రైవర్ షబ్బీర్ లకు గాయాలయ్యాయి. వర్షాల నేపథ్యంలో తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులోని పెన్ గంగా నది ఉధృతిని పరిశీలించేందుకు వెళ్లగా బోరజ్ మండలంలోని డొలారా జాతీయ రహదారిపై గురువారం నిలిచి ఉన్న పోలీస్ వహనాన్ని లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో సీఐ సాయినాథ్ తో పాటు డ్రైవర్ షబ్బీర్ కు తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికులు వారిని ఆదిలాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. విషయాన్ని తెలుసుకున్న వెంటనే ఎస్పీ అఖిల్ మహాజన్ హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లి సీఐ, డ్రైవర్‌ను ఎస్పీ పరా మర్శించారు. డాక్టర్‌తో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి పై ఆరా తీశారు. ఎస్పీ వెంట డీఎస్పీ జీవన్ రెడ్డి తదితరులు ఉన్నారు. అటు ఎమ్మెల్యే పాయల్ శంకర్ సైతం సీఐ సాయినాథ్ ను పరామర్శించారు.
ప్రజా సంరక్షణకు తక్షణ చర్యలు..
వరద పరిస్థితులలో ప్రజల సంరక్షణ కోసం తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి అన్నారు. గురువారం కెరమెరి మండలం మెటపిప్రి, సంగవి గ్రామాలను సందర్శించి వరద పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నెలకొన్న వరద పరిస్థితుల నేపథ్యం లో ప్రజల సంరక్షణ కొరకు చర్యలు చేపడుతున్నామని కలెక్టరేట్ భవన సముదాయంలో కంట్రోల్ రూమ్ 8500844365 నంబర్ ఏర్పాటు చేయడం జరిగిందని, అత్యవసర సహాయం, సమాచారం కోసం సంప్రదించవచ్చని తెలిపారు.
ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆగస్టు28 (విజయక్రాంతి): జిల్లా వ్యాప్తంగా రెం డు రోజులపాటు ఎడతెరిపిలేని వానలతో ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు చేరడంతో అధికారులు గేట్లను ఎత్తి నీటిని దిగువకువదులుతున్నారు. మంగళ,బుధవారం కురిసిన వర్షాలతో చేలలోకి వరద నీరు చేయడంతో నీట మునిగాయి.లోతట్టు ప్రాంతాల్లో నివాసాలలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఎడతెరిపిలేని వర్షంతో బుధవారం వినాయకుడి విగ్రహాలను తీసుకువెళ్లేందుకు నిర్వాహకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.గురువారం దెబ్బెన మండలంలోని పలు వార్డులను కలెక్టర్ వెంకటేష్ దోత్రే,కెరమెరి మండ లంలో అదనపు కలెక్టర్ దీపక్ తివారి వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు.భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.