calender_icon.png 29 August, 2025 | 9:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంక్షేమ అభివృద్ధి పనులను సమర్థవంతంగా నిర్వహించాలి

29-08-2025 07:05:18 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లాలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పనులు సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జూమ్ మీటింగ్ ద్వారా మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఎపిఓలు, ఎపీఎంలు, హౌసింగ్, ఇంజనీరింగ్ లతో జిల్లాలో కొనసాగుతున్న పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన, వనమహోత్సవం, ఎన్నికల నిర్వహణ, పారిశుధ్యం, సీజనల్ వ్యాధుల నియంత్రణ, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతి, నిరుపేదలకు ఆర్థిక సహాయం, విద్యాసంస్థలు, వైద్య సిబ్బంది క్యాంప్ ల నిర్వహణ అంశాలపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కొనసాగుతున్న సంక్షేమ అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలో విద్యుత్ కనెక్షన్ లేని పాఠశాలలు, త్రాగునీటి సౌకర్యం, మధ్యాహ్న భోజనం వంటశాల లు లేని పాఠశాలలు, బాలికలు, బాలురకు ప్రత్యేక మూత్రశాలలు లేని పాఠశాలలు, చాలా రోజుల నుండి పాఠశాలలకు హాజరు కాని విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. భారీ వర్షాల వలన పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాలు దెబ్బతిన్నాయని, వాటి వివరాలను వెంటనే సమర్పించాలని తెలిపారు. వనమహోత్సవం 2025 కార్యక్రమాల లక్ష్యాలను పూర్తిస్థాయిలో సాధించాలని అధికారులకు సూచించారు.

గ్రామాలలో పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని, నివాస ప్రాంతాలు, అంతర్గత రహదారులు, మురుగు కాలువలలో పూడికతీత చర్యలు తీసుకోవాలని తెలిపారు. సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు దోమల వృద్ధిని నిరోధించేందుకు వర్షపు నీటి నిల్వలను తొలగించాలని, ఆయిల్ బాల్స్, బ్లీచింగ్ పౌడర్ పిచికారి చేయాలని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, నిబంధనల ప్రకారం నిర్ణీత విస్తీర్ణంలో ఇల్లు నిర్మించుకునే విధంగా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని, ఇల్లు నిర్మించుకోని వారిని గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రతి పాఠశాల, గురుకులంలో వైద్య సిబ్బంది ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. జిల్లాలో కొనసాగుతున్న సంక్షేమ అభివృద్ధి పనులు నిర్ణిత గడువులోగా పూర్తిచేసే విధంగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు.