01-01-2026 12:27:28 AM
యూరియా కోసం కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల క్యూ
మహబూబాబాద్, డిసెంబర్ 31 (విజయక్రాంతి): వానాకాలం పంటల సాగు సమ యంలో యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందు లు పడ్డ రైతులు, యాసంగి పంటల సాగులో కూడా అదే తరహాలో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధవారం యూరియా కోసం తెల్లవారుజాము నుంచే రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద క్యూ కట్టారు. రైతు వేదికలు, సహకార సంఘాల వద్ద చేతిలో ఆధార్ కార్డు, పట్టా పాస్ పుస్తకం జిరాక్స్ పత్రాలను పట్టుకొని చలిలో గజగజ వణుకుతూ నిల్చున్నారు.
వానకాలంలో యూ రియా కోసం రైతులు ఇబ్బందులు పడ్డ సంఘటనలను దృష్టిలో ఉంచుకుని, యాసంగిలో ఆ పరిస్థితి తలెత్తకుండా ఎరువుల యాప్ ద్వారా యూరియా పంపిణీ చేయడానికి వ్యవసాయ శాఖ శ్రీకారం చుట్టింది. అయితే ఎరువుల యా ప్ మొదటి రోజే మొరాయించడంతో పాత పద్ధతిలో పంపిణీకి శ్రీకారం చుట్టారు. దీంతో రైతులు యూరియా కోసం మళ్లీ తిప్పలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం యాసంగి సీజన్లో మొక్కజొన్న, వరి పంట పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు.
ప్రారంభం లోనే యూరి యా తిప్పలు మొదలు కావడంతో ఇక పంటల సాగు సమయంలో యూరియా దొరుకుతుం దో లేదో అనే అనుమానంతో రైతులు ముందుగానే యూరియా తెచ్చి పెట్టుకోవడానికి ఉరుకులు పరుగులు పెడుతున్నారు. దీనివల్ల రైతు వేదికల వద్ద, ఎరువుల విక్రయ కేంద్రాల వద్ద రద్దీ పెరిగి ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
అధికారులు యూరియా కోసం ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని, యాసంగి పంటల సాగుకు అవసరమైన యూరియా అందుబాటులో ఉందని విస్తృతంగా ప్రచారం చేస్తున్నప్పటికీ రైతులు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలుచోట్ల బుధవారం రైతులు యూరియా కోసం బారులు తీరడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. మహబూబాబాద్ జిల్లా కురవి రైతు వేదిక వద్ద, కేసముద్రం మండలం కల్వల గ్రామంలో యూరియా పంపిణీ కేంద్రం వద్ద రైతులు బారులు తీరారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేటలోనూ బారులు తీరారు.
అధికారులకు మానసిక ఒత్తిడి
యూరియా పంపిణీ అంశం ఇప్పుడు వ్యవసాయ శాఖ అధికారులను ‘టెన్షన్’ కు గురిచేస్తోంది. రాత్రి 11 గంటల వరకు ఇంటికి చేరకపోవడం, తెల్లవారు జామునే తిరిగి విధుల్లోకి వచ్చి ఆరు గంటలకు యూరియా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం, పెద్ద ఎత్తున తరలివస్తున్న రైతులను కట్టడి చేయడానికి వ్యవసాయ శాఖ అధికారులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. మహబూబాబాద్ జిల్లా వ్యవసాయ అధికారిని తీవ్రమైన ఒత్తిడి తట్టుకోలేక మంగళవారం రాత్రి బీపీ పెరిగి ఆసుపత్రిలో చేరారు.