calender_icon.png 20 August, 2025 | 6:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి

20-08-2025 01:44:54 AM

- ఎన్నికల వేళ కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలి 

- రూ.18 వేల వేతనం ఇవ్వాలి

- ప్రతినెల 30 న జీతాలు చెల్లించాలి 

- తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ డిమాండ్

- హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద ధర్నా 

ఖైరతాబాద్, ఆగస్టు 19 (విజయక్రాంతి): రాష్ర్టంలో ఆశ వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియ న్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం సీఐటీయూ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్, సౌత్ సిటీ కమిటీల ఆధ్వర్యంలో లకిడికాపూల్‌లోని హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద ఆశా వర్కర్లతో కలిసి భారీ ధర్నా నిర్వహించారు. అనంతరం డీఆర్వో వెంకటాచారికి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా సీఐటీయూ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శి ఎం వెంకటేష్, సౌత్ సిటీ అధ్యక్షురాలు ఎం మీనా మాట్లాడుతూ.. ఆశా వర్కర్లకు సరైన సమయంలో వేతనాలు అందక ఇబ్బందులకు పడుతున్నారని చెప్పారు. గడిచిన జూలై నెల జీతాలు ఇంతవరకు రాలేదని వాపోయారు. గతంలో ప్రతినెల ఆఖరి రోజున జీతాలు ఖాతాలో జమ అయ్యేవి అని, ప్రస్తుతం రెండు నెలలు గడుస్తున్నా జీతాలు ఇవ్వలేని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ర్టంలో ఆశా వర్కర్లకు రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు.

2023 సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 15 రోజుల నిరవధిక సమ్మె చేస్తే అప్పటి అధికారులు ఆశా యూనియన్ రాష్ర్ట కమిటీతో చర్చలు జరిపి రూ.50 లక్షల ఇన్సూరెన్స్, మట్టి ఖర్చులకు రూ.50,000, ఈఎస్‌ఐ, పీఎఫ్, ఉద్యోగ భద్రత, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పిస్తామని నిర్దిష్టమైన హామీలను ఇచ్చారని గుర్తుచేశారు. ఆ హామీలను ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదని వాపోయారు.

ఆ హామీలతోపాటు అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీల ప్రకారం వేతనాలు పెంచడం, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో సీఐటీయూ నగర ఉపాధ్యక్షుడు ఎం దశరథ్, తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియన్ సెంట్రల్ సిటీ అధ్యక్షురాలు టి యాదమ్మ, నాయకులు భాగ్యలక్ష్మి, లత, రాణి, రాధిక, జయలక్ష్మి, సౌత్ సిటీ నాయకులు శ్రీదేవి, సఫియా, జాహీదా, యాస్మిన్ పాల్గొన్నారు.