గీత కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి
పెండింగ్ లో ఉన్న ఎక్స్గ్రేషియా వెంటనే విడుదల చేయాలి
తెలంగాణ రాష్ట్ర గీత పనివారల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొమ్మగాని ప్రభాకర్
సూర్యాపేట, జూన్ 21 (విజయక్రాంతి): గీత కార్మికుల పెన్షన్ ఎక్స్గ్రేషియా, లైసెన్స్ సొసైటీల సమస్యలు జూలై లోపు పరిష్కరించాలని లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని తెలంగాణ రాష్ట్ర గీత పనివారల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొమ్మగాని ప్రభాకర్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ధర్మభిక్షo భవనంలో సంఘం సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు.
బొమ్మగాని ధర్మ బిక్షం నేతృత్వంలో అనేక పోరాటాలు చేసి పెన్షన్, లైసెన్స్, ఎక్స్గ్రేషన్లు సాధించుకున్నామని అది ధర్మభిక్షం పోరాట ఫలితమైన అని కొనియాడారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా చెల్లించకుండా కాలయాపన చేస్తూ గీత కార్మికులపై సవితి తల్లి ప్రేమను చూపిస్తూ నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో వారికి రావాల్సిన 10 కోట్ల రూపాయలు బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆయన హెచ్చరించారు.
పెన్షన్ పొందుతున్న గీత కార్మికుడు చనిపోతే ఆ పెన్షన్ ఇతర పెన్షన్ల మాదిరిగా భార్యకు వచ్చేటట్లు ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. రేగటి లింగయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోఆర్డినేటింగ్ సెక్రెటరీ బొమ్మగాని నాగభూషణం, జిల్లా గౌరవ అధ్యక్షులు బొమ్మగాని శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొండ కోటయ్య, మాజీ కౌన్సిలర్ అనంతుల మల్లేశ్వరి, నియోజకవర్గ కార్యదర్శి బండారం లక్ష్మయ్య, తొట్ల ప్రభాకర్, బూర వెంకటేశ్వర్లు, తొట్ల వెంకన్న, బూర సైదులు, రేగటి సాంబయ్య, పందుల జానయ్య, ఎడెల్లి శ్రీకాంత్, అయితే గాని కామేష్, రెడ్డి మల్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.






