12 March, 2026 | 3:34 PM

గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది

12-03-2026 12:00 AM

ఎమ్మెల్యే కనకయ్య

ఇల్లందు టౌన్, మార్చి11 (విజయక్రాంతి): ఇల్లందు మండలంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పర్యటనలో భాగంగా బొజ్జాయిగూడెం, మొండి తోగు, విజయలక్ష్మీనగర్, మిట్టపల్లి, ఇందిరానగర్, బాలాజీనగర్ గ్రామాల్లో సుమారు రూ.1 కోటి 53 లక్షల వ్యయంతో నిర్మాణం పూర్తున, చేపట్టనున్న డ్రైనేజ్ సీసీ రోడ్లకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. ఇందిరానగర్లో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద లబ్ధిదారులు గొనెల సరోజనిరవి ఇంటికి గృహప్రవేశం నిర్వహించారు.

అనంతరం ఇల్లందు మున్సిపల్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ ద్వారా 15 మంది లబ్ధిదారులకు రూ.19 లక్షల 85 వేల వ్యయంతో స్కూటీలు, బ్యాటరీ సైకిళ్లు, బ్యాటరీ వీల్ చైర్లు పంపిణీ చేశారు. దివ్యాంగుల వివాహ కానుకలు, ట్రాన్స్ జెండర్ లోన్ల కింద 8 మంది లబ్ధిదారులకు రూ.11 లక్షల 55 వేల చెక్కులు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, అన్ని వర్గాల సంక్షేమం కోసం పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు.  మార్కెట్ కమిటీ చైర్మెన్ బానోత్ రాంబాబు, మున్సిపల్ చైర్మెన్ దొడ్డా కిరణ్ మిత్ర, వైస్ చైర్మెన్ పెండేల రాజు, మాజీ వైస్ ఎంపీపీ మండల రాం మహేష్, మండల అధ్యక్షుడు పులి సైదులు, సర్పంచులు, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.