గుర్తింపు సంఘం ఎన్నికలు వెంటనే నిర్వహించాలి
ఆసిఫాబాద్ (విజయక్రాంతి): సిర్పూర్ పేపర్ మిల్లులో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు వెంటనే నిర్వహించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ డిమాండ్ చేశారు. పేపర్ మిల్ ఎదుట కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 79వ రోజుకు చేరుకున్న సందర్భంగా ఏఐటీయూసీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది.ఈ సందర్భంగా బోగే ఉపేందర్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతోనే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించడంలో జాప్యం జరుగుతోందని ఆరోపించారు.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎన్నికల నిర్వహణలో విఫలమయ్యారని విమర్శించారు. ఎన్నికలు లేకపోవడంతో కార్మికులు శ్రమదోపిడికి గురవుతున్నారని, పాత కార్మికులందరినీ ఎలాంటి షరతులు లేకుండా విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం వెంటనే గుర్తింపు సంఘాల ఎన్నికలు నిర్వహించాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కార్మికులు పాల్గొన్నారు.






