6 August, 2026 | 1:46 PM

ఆచార్య జయశంకర్‌కు ఘన నివాళి

06-08-2026 12:45 PM

గజ్వేల్, ఆగస్టు 6: గజ్వేల్, ప్రజ్ఞాపూర్ నియోజకవర్గ విశ్వకర్మ మనుమయ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. గజ్వేల్ జాలిగామ బైపాస్ రోడ్డు చౌరస్తాలో  జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు గడియారం వెంకటాచారి, వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ఉపాధ్యక్షుడు గడియారం స్వామిచారి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆచార్య జయశంకర్ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ప్రత్యేక రాష్ట్రం కోసం జీవితాంతం అంకితభావంతో పోరాడి ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో నింపారని పేర్కొన్నారు. ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, విశ్వకర్మల ఐక్యతతో హక్కుల సాధన కోసం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి విఠలాచారి, కోశాధికారి గడియారం నాగరాజు చారి, లక్ష్మీనరసింహ చారి, ఉపాధ్యక్షుడు గడియారం వెంకటేశం చారి, వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ అధ్యక్షుడు కొక్కొండ శ్రీనివాస్ చారి, సంఘ సభ్యులు ధర్మయ్య, వెంకటేశం, బ్రహ్మచారి, సత్యం, భాస్కర్, శివ తదితరులు పాల్గొన్నారు.