22-10-2025 12:00:00 AM
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మం టౌన్, అక్టోబర్ 21(విజయ క్రాంతి): శాంతి భద్రతల సంరక్షణలో పోలీసుల పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం (పోలీస్ ఫ్లాగ్ డే) సందర్భంగా మంగళవారం పోలీసు పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సిపి సునీల్ దత్, డిఎఫ్‌ఓ సిద్దార్థ్ విక్రమ్ సింగ్ లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ శాంతి భద్రతలు కాపాడేందుకు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహించిన పోలీసు అమరవీరులకు ప్రతి ఒక్కరూ నివాళులు అర్పించాలని అన్నారు.
ప్రభుత్వంలో ప్రతి శాఖ పని తీరులో పోలీస్ సహకారం సంపూర్ణంగా ఉంటుందని అన్నారు. భూ సేకరణ, ధాన్యం కొనుగోలు, ఎన్నికల నిర్వహణ, శాంతియుతంగా వేడుకలు జరగాలన్నా కూడా ప్రతి ఒక్క అంశంలో పోలీస్ సహకారం అవసరమని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. ఖమ్మం జిల్లా యంత్రాంగానికి పోలీసులు సంపూర్ణ సహకారం అందిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో పోలీసు కమీషనర్ సునీల్ దత్ మాట్లాడుతూ 21 అక్టోబర్ 1959 లద్దాక్ ప్రాంతంలో దేశ సరిహద్దు కాపాడటంలో 10 మంది సిఆర్పిఎఫ్ సిబ్బంది చైనా సైనికులతో వీరోచితంగా పోరాడి మరణించారని, విధులలో ఉండి మరణించిన పోలీసుల త్యాగాలకు చిహ్నంగా మనం నేడు పోలీసు అమరవీరుల సంస్కరణ దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు.
డిఎఫ్‌ఓ సిద్దార్థ్ విక్రమ్ సింగ్ మాట్లాడుతూ పోలీస్ యూనిఫామ్ చాలా పెద్ద బాధ్యత అని, ప్రతి రోజు క్రిమినల్స్ తో పోరాటం, చాలా కష్టాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుందని అన్నారు. అనంతరం విధి నిర్వహణలో అమరులైన పోలీసులకు స్మారక స్ధూపం వద్ద జిల్లా కలెక్టర్, పోలీసు కమీషనర్, అటవీశాఖ అధికారి పుష్పగుచ్చాలు ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్ పేరడ్ మైదానంలోని అమరవీరుల స్ధూపం వద్ద స్మృతి పరేడ్ నిర్వహించగా, పోలీస్ అమర వీరుల స్థూపం వద్ద జిల్లా అధికార యంత్రాంగం, పోలీస్ అధికారులు, సిబ్బంది, అమరవీరుల కుటుంబీకులు పూలమాలలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం పోలీసు ఆయుధాలు కిందకు దింపి వందనం చేసి రెండు నిముషాలపాటు మౌనం పాటించారు. అదనపు డిసిపిలు ప్రసాదరావు, రామాను జం, పోలీసు అధికారులు, అమరవీరుల కుటుంబసభ్యులు పాల్గొన్నారు.