22-10-2025 12:00:00 AM
త్యాగాలకు వెరవని ధీరులు
ట్వంటీఫోర్ అవర్స్ ఆన్ డ్యూటీ
కుటుంబాలకు దూరంగా బాధ్యతలు
విధి నిర్వహణలో ఎందరో అమరులు
ఈనెల 31 వరకు వివిధ కార్యక్రమాలు
నేడు పోలీసుల అమరవీరుల సంస్మరణ దినం
భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 21 (విజయక్రాంతి): కనిపించే మూడు సింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి సంకేతాలైతే, కనిపించని నాలుగో సింహమేరా పోలీస్... ఇది ఓ సినిమాలో హీరో చెప్పే డైలాగ్. జిల్లాలో కొందరు పోలీసులను చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది. శాంతిభద్రతల పరి రక్షణకు పోలీసులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వర్తి స్తుంటారు. పోలీసు విధి నిర్వహణ చాలా శ్రమతో కూడుకున్నది. పోలీసులు లేని సమాజాన్ని ఊహించుకోలేం.
సంపన్నుడు మొదలు సామాన్యుడి వరకు ప్రతి ఒక్కరూ ప్రతి అవసరానికీ సాయం కోరేది పోలీసులనే. కుటుంబాన్ని, పండుగలు పబ్బాలను సైతం త్యజించి, ప్రజల కోసం పనిచేసే రక్షక భటుల సేవలు అనిర్వచనీయం. ఒక్కోసారి ప్రాణాలను సైతం పణం గా పెట్టాల్సి వస్తదని తెలిసినా వెనుకడుగు వేయని ధీరులు. జిల్లాలో ప్రజా రక్షణ కోసం పనిచేస్తూ విధి నిర్వహణలో ఎందరో అమరులైన సంఘటనలు ఉన్నాయి. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా వారిపై విజయక్రాంతి ప్రత్యేక కథనం..
శాంతి పరిరక్షణలో రక్షకభటులు కీలకం..
ఒంటిపై పోలీసు యూనిఫాం, తల పై టోపీ, ఆ టోపీపై మూడు సింహా లు,చేతి లో లాఠీ ఈ ఆహార్యంతో కళ్లెదుట నడిచొచ్చే న్యాయమే పోలీసు.అంతర్గత శత్రువుల నుంచి కాపాడి ప్రజలకు భద్రత, భరోసా ఇస్తున్నారు. ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో పోలిస్తే పోలీసుల విధులు విభిన్నం. వీరికి పని గంటలతో సంబంధం ఉండదు. నిత్యం అప్రమత్తంగా ఉండా ల్సిందే. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ప్రతి క్షణం ఆలోచించాల్సిందే. దీంతో వారు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఈ ఒత్తిడి కారణంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. అసాంఘిక శక్తుల ఆట కట్టించడం, ప్రజల మాన, ప్రాణాలకు కాపాడటంలో వారి సేవలు అభినందనీయం. విధినిర్వహణలో ప్రాణాలను సైతం లెక్క చేయ కుండా క్రమశిక్షణతో, అంకిత భావంతో, నిబద్ధతతో కర్తవ్య నిర్వహణలో జిల్లాకు చెందిన పలువురు పోలీస్ లు ప్రాణాలర్పించారు.
త్యాగాలకు వెరవని ధీరులు..
పోలీసు విధి నిర్వహణ చాలా శ్రమతో కూడుకున్నది. ఇతర ఉద్యోగుల్లా కొన్ని గంటలకు మాత్రమే పరిమితమయింది కాదు. ఇరవై నాలుగు గంటల ఉద్యోగం ఒక్క పోలీసు ఉద్యోగమే. సంపన్నుడు మొదలు సామాన్యుడి వరకు ప్రతి ఒక్కరూ ప్రతి అవసరానికీ సాయం కోరేది పోలీసులనే. శాంతి భద్రతలను అదుపులో పెట్టడం, నేరగాళ్ళను నిద్రాహారాలు మాని డ్యూటీలు చేసే పోలీసులంటే అటు అధికారులకు, ఇటు సమాజానికి చిన్న చూపే. సమయ పాలనలేని విధులు, పై అధికారులతో తిట్లు, ఛీత్కారాలు,ఇలా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. పోలీసులకు విశ్రాంతి కావాలనే విషయాన్ని పాలకులు, అధికారులు విస్మరిస్తున్నారు. పోలీసులకు షిప్టు డ్యూటీలు అమలు చేయలంటూ ఉమ్మడి ప్రభుత్వం 2007లో జీవో జారీ చేసింది.
ఏళ్ళు గడిచి నా ప్రస్తుతం ఆ ఊసే లేదు. మరోవైపు విధి నిర్వహణలో ఒత్తిడి కారణంగా 80 శాతం మంది తలనొప్పి, బీపీ, మధు మేహం, మెడ, వెన్నునొప్పి ఇలా ఏదో ఒక సమస్యతో బాధ పడుతున్నట్లు అధికారిక లెక్కలే చెబుతున్నాయి. హోంగార్డు, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుళ్ల పరిస్థితి మరీ దారుణం. డ్యూటీకి వచ్చింది మొదలు తిరిగి ఇంటికి వెళ్లేంత వరకు విరామం లేకుండా పని చేయాల్సిందే. బందోబస్తు డ్యూటీల్లో పాల్గొనే వారి పరిస్థితి సరేసరి. ట్రాఫిక్ డ్యూటీలు నిర్వహించే సిబ్బంది కాలుష్యం వల్ల ఊపిరి తిత్తుల సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. ఇన్ని సమస్యల మధ్య సమాజానికి ఇంత సేవ చేస్తున్న పోలీసులను గౌరవించడం మనం దరి బాధ్యత.
ఫ్లాగ్ డేతో కార్యక్రమాలు..
సమాజ పరిరక్షణ కోసం నిరంతరం పోరాడి ప్రాణాలు కోల్పోయిన పోలీసుల త్యాగ నీరతిని స్మరించుకునేందుకు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం (ఫ్లాగ్ డే) సందర్భంగా పది రోజులపాటు వివిధ పోలీస్ స్టేషన్ లలో పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఏటా అక్టోబర్ 15 నుంచి 21వ తేదీ వరకు జరిగే వారోత్సవాలను ఈసారి 21 నుంచి 31 వ వరకు నిర్వ హిస్తున్నారు. 21వ తేదీన జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో ఫ్లాగ్ డే నిర్వహించారు. ఇక ఓపెన్ హౌస్ కార్యక్రమం, రక్తదాన శిబిరం, వ్యాసరచన పోటీలు ఏర్పాటు చేయనున్నారు. తొలిరోజు కరపత్రాలు, పోస్టర్లను ఆవిష్కరించను న్నారు. కాగా, సామాజిక సేవ, పోలీసుల విధుల పై అవగాహన కల్పించడం, ఫొటో గ్రఫీ, షార్ట్ ఫిలింలపై జిల్లాలో పోటీ లు నిర్వహిస్తున్నారు.
అమరుల స్ఫూర్తిని కొనసాగిస్తాం..
శాంతి భద్రతల పరిరక్షణలో అమరులైన పోలీసుల స్ఫూర్తితో ప్రజలకు మరింత చేరువఅవుతాం. ఈ నెల 21 నుంచి పది రోజుల పాటు పోలీస్ ఫ్లాగ్ డే నిర్వహణ కోసం జిల్లా పోలీస్శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశాం. అమరుల కుటుంబాలకు అండగా నిలబడతాం. ప్రజలు, పోలీసులు కుటంబ సభ్యుల్లా కలిసిపోయేపరిస్థితిని కల్పిస్తాం. కమ్యూనిటీ పోలీసింగ్ విధానం ద్వారా ప్రజలకు చేరవై, వారి కష్టాల్లో పాలు పంచుకుంటాం.
- రోహిత్ రాజ్, జిల్లా ఎస్పీ