calender_icon.png 9 June, 2025 | 2:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ సమస్యకు పరిష్కారం ఆపరేషన్ కాదు?

06-05-2024 12:00:00 AM

ప్రతి ఐదుగురు అమ్మాయిల్లో ముగ్గురిని వేధిస్తోన్న అతిపెద్ద సమస్య పీరియడ్స్. ఈ సమయంలో నడుం నొప్పి, కడుపు నొప్పి, డిప్రెషన్, ఆందోళన వంటి సమస్యలు అమ్మాయిలను మానసిక వేదనకు గురి చేస్తాయి. ఈ సమస్యలను భరించడం ఒక ఎత్తు అయితే. ప్రతినెలలా పీరియడ్స్ సమయానికి రాకపోతే అవి ఫైబ్రాయిడ్స్ (నీటి బుడగలు)గా మారి సంతానలేమి సమస్యకు దారి తీయడం మరో సమస్యగా చెప్పొచ్చు. గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ సమస్య చిన్నదిగా ఉన్నప్పుడే జీవన శైలిలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకుంటే సరిపోతుంది. ప్రతి సమస్యకు మెడిసిన్, ఆపరేషన్ అనేవి శాశ్వాత పరిష్కారాలు కావు.అవి కేవలం ఉపశమనం కొసమే అంటున్నారు సీనియర్ హెల్త్ ఆఫీసర్, ప్రముఖ గైనకాలజిస్టు డాక్టర్ ఎల్. జయశ్రీ. మహిళలు ముఖ్యంగా జీవన శైలిలో చేసుకోవాల్సిన చిన్న చిన్న మార్పుల గురించి వివరించారు..!

చాలాసార్లు ఈ ఫైబ్రాయిడ్స్ (నీటి బుడగలు) బయటకు ఎలాంటి లక్షణాలనూ చూపించవు. అందుకే వాటిని గుర్తించడం కూడా కష్టమవుతుంటుంది. చాలా కేసుల్లో వేరే ఆరోగ్య సమస్య గురించి పరిశీలిస్తున్నప్పుడు ఫైబ్రాయిడ్స్ బయటపడుతుంటా యి. దాదాపు ప్రతి ముగ్గురు మహిళల్లో ఇద్దరికి ఇలాంటి నీటి బుడగల సమస్యలు వస్తాయి. ఈ ఫైబ్రాయిడ్స్ వల్ల రుతుస్రావం ఎక్కువగా కావడం, పొత్తి కడుపులో అదే పనిగా నొప్పి రావడం, రుతుక్రమం మధ్య తక్కువ వ్యవధి ఉండటం వంటి సమస్యలు వస్తుంటాయి. నడుము నొప్పి, గర్భధారణ సమస్యలు, మిస్ క్యారేజ్ వంటి లక్షణాలు కూడా గర్భాశయంలో ఫైబ్రాయి డ్స్ ఉన్నవారిలో కనిపించొచ్చు. ఫైబ్రాయిడ్స్ పెద్దగా ఉన్న కేసుల్లో మూత్రాశ యంపై ఒత్తిడి పెరిగి. పదే పదే మూత్రం వచ్చే సమస్య, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు కూడా రావొచ్చు. ఈ గర్భాశయ ఫైబ్రాయిడ్స్ ఏర్పడటానికి ప్రధాన కారణం స్త్రీల శరీరంలో ఉత్పత్తి అయ్యే ఈస్ట్రోజెన్ అనే హార్మోన్. అందుకే మెనోపాజ్ దశ చేరుకున్న మహిళల్లో ఈ ఫైబ్రాయిడ్స్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. 

ఎవరికి వస్తాయి?

30 నుంచి 50 ఏళ్ళ మధ్య వయసులో ఉన్నవారికి ఎక్కువగా ఈ గర్భాశయ ఫైబ్రాయిడ్స్ వస్తుంటాయి. స్థూలకాయంతో బాధపడుతున్న మహిళల శరీరాల్లో ఈస్ట్రోజెన్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వారికి ఈ ముప్పు ఎక్కువ. గర్భం ధరించిన మహిళల్లోనూ ఇలాంటి ఫైబ్రాయిడ్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. 

పరిమాణంలో ఈ కణితులు వేరుశెనగ గింజ నుంచి పుచ్చకాయ సైజు వరకూ రకరకాల స్థాయిల్లో ఉంటుంటాయి. ఫైబ్రాయిడ్ ఎంత పెద్దదైతే. దాని వల్ల కలిగే బాధ కూడా అంత ఎక్కువగా ఉంటుంది. గర్భాశయంలో ఫైబ్రాయిడ్ ఎక్కడ ఉందన్న దాన్ని బట్టి దాని రకాన్ని వైద్యులు వర్గీకరిస్తారు. ఎక్కువగా గర్భాశయ గోడల మధ్యలో ఇవి కనిపిస్తుంటాయి. గర్భాశయ లోపలి గోడల్లో ఫైబ్రాయిడ్స్ ఏర్పడినప్పుడు ఎక్కువగా రుతుస్రావం కావడం, మిస్ క్యారేజీ లాంటి సమస్యలు వస్తుంటాయి. కొన్నిసార్లు గర్భాశయ బయటి గోడలపై కూడా ఫైబ్రాయిడ్స్ ఏర్పడుతుంటాయి.

ఎందుకు వస్తుందంటే?

అండాశయం నుంచి అండం విడుదల కాకుండా ఉండిపోవడంతో నెలసరి రాదు. అండాశయంలో అండం ఉండటంతో దాని చుట్టూ నీరు చేరి బుడగలు వస్తాయి. దాన్నే పీసీఓడీగా చెబుతాం. ఇది జీవన శైలిలో మార్పులతోనే వస్తుంది. గతంలో తక్కువగా ఈ కేసులుండేవి. కరోనా తర్వాత ఎక్కువగా కేసులు వస్తున్నాయి. వ్యాయామం తగ్గిపోవడం, ఫాస్ట్‌ఫుడ్, జంక్‌ఫుడ్, మైదా వినియోగం పెంచడంతో ఈ సమస్య వస్తుంది. ఎక్కువ మందికి నెలసరి తక్కువగా వస్తుంది. కొంతమందికి మగవాళ్ళ హార్మోన్లు పెరుగుతాయి. అవాంఛిత రోమాలు ఎక్కడ పడితే అక్కడ వస్తాయి. తీపి పదార్థాలు తినాలనిపిస్తుంది. గర్భధారణ ఆలస్యం కావడం తో పాటు గర్భం వచ్చినా నిలవడం కష్టంగా ఉంటుంది. మధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయం, గుండె జబ్బులు వస్తాయి. 

ఏం చేయాలంటే?

వ్యాయామం, ఆహారంలో మార్పులతో పీసీఓడీ, పీసీఓఎస్ తగ్గిపోతుంది. కార్డియో ఎక్సర్‌సైజ్ చేయాలి. నడక వేగం పెంచాలి. సైక్లింగ్, ఈత చేయాలి. తీపి పదార్థాలు తినొద్దు. ప్రోటీన్లు ఎక్కువగా తీసుకోవాలి. రోజూ రెండు గుడ్ల తెల్లసొన, రెండు పూటలా పప్పు తినాలి. మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి. లేకపోతే పీసీఓడీ, పీసీఓడీని నివారించలేం. మహిళల పీరియడ్స్, 

గర్భధారణ సమయంలో ఇవి ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంది. ఇంకా స్థూలకాయం, వంశపార్యపర్యత వల్ల కూడా ఫైబ్రాయిడ్స్  ఏర్పడటానికి ముఖ్య కారణాలు. కొన్ని లక్షణాల ద్వారా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయని గుర్తించవచ్చు. అధిక రుతుస్రావం, పొత్తి కడుపులో నొప్పి, నడుం నొప్పి, మూత్రాశయంపై ఒత్తిడి పెరిగి తరచూ మూత్రానికి వెళ్లాలని అనిపించడం వంటి లక్షణాలను గమనించవచ్చు. అందుకనే చాలా వరకు తాజా పండ్లు, కూరగాయలు, చేపలు మీ ఆహారంలో భాగం చేసుకోవాలి. రోజుకు మూడు నాలుగు సార్లు డైరీ ప్రొడక్ట్స్ తీసుకునే వారిలో 30 శాతం మందిలో ఫైబ్రాయిడ్స్  రావు.

ఇది కూడా ఒక కారణం

ప్రస్తుతం థైరాయిడ్ సమస్య అనేది చాలా సహజంగా మారింది. థైరాయిడ్ లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి హైపో, రెండోది హైపర్. థైరాయిడ్ వల్ల బరువు పెరగడం, తగ్గడం వంటివి జరుగుతాయి. దీని వల్ల కూడా పీరియడ్ ఆగిపోవడం,  పీరియడ్  ఎక్కువ కావడం వంటివి జరుగుతాయి. పీరియడ్స్ రెగ్యులర్‌గా రాకపోతే హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. కొంతమంది అమ్మాయిలు మూడు నెలలకు, ఆరు నెలలకు, సంవత్సరానికి ఓసారి పీరియడ్స్ అవుతుంటారు. ఈ సమస్య వల్ల కూడా సంతానలేమి సమస్యతో బాధపడుతుంటారు. హార్మోన్ల అసమతుల్యత కారణంగా ప్రతి నెల గర్భాశయంలో అండాలు విడుదల అనేది ఆగిపోతుంది. ప్రతినెల గర్భాశయంలో ఒక అండం తయారు అవుతుంది. కానీ బయటకు విడుదల కాకపోవడం చేత అది లోపలే ఉండిపోయి నీటి బుడగలు తయారవుతాయి. 

పీసీఓఎస్, పీసీఓడీకి మధ్య ఉన్నా తేడాలను ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలి

PCOS

1. హార్మోన్ల అసమతుల్యత, గర్భాశయంలో చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్ (కణితులు).

2. పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం, జుట్టు రాలిపోవడం, బరువు పెరగడం.

3. కొలెస్ట్రాల్ అధిక స్థాయిలో ఉండటం.

4. టైప్  2 డయాబెటిస్, గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలూ ఉన్నాయి.

5. ఈ సమస్యను రక్త పరీక్షలు, అల్ట్రా సౌండ్ ద్వారా గుర్తించవచ్చు.

PCOD 

1. గర్భాశయంలో చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్ ఏర్పడటం.

2. రెండు, మూడు నెలలకు ఒక సారి పీరియడ్స్ రావడం.

3. హార్మోన్ల అసమతుల్యత 

4. అధిక రక్తపోటు, డయాబెటిక్, గుండె సంబంధిత సమస్యలు.

5. ఈ సమస్యను అల్ట్రా సౌండ్ లేదా హార్మోనల్ పరీక్షల ద్వారా 

గుర్తించవొచ్చు.

చికిత్స ఏంటి?

క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకుంటే, ఆరంభ దశలోనే ఈ ఫైబ్రాయిడ్స్‌ను గుర్తించవచ్చు. ఈ ఫైబ్రాయిడ్స్‌కు రెండు రకాల చికిత్సలు చేస్తారు. ఒకటి మందులతో ఫై బ్రాయిడ్స్ తగ్గించడం. రెండోది శస్త్ర చికిత్స ద్వారా తొలగించడం. ఒకవేళ బాధితులకు రక్తస్రావం ఎక్కువగా అవుతుంటే, ముందు గా అనిమీయాకు (రక్తహీనత సమస్యకు) చికిత్స చేస్తారు. రక్తస్రావం తక్కువగానే ఉంటే, మందులను సూచిస్తారు. ఎక్కువగా హార్మోన్‌లను నియంత్రించే ఔషదాలను  రాస్తారు. కొందరు బాధితులు హార్మోన్ ఔషధాలు తీసుకునే స్థితిలో ఉండరు.

అలాంటి వారికి శస్త్ర చికిత్స చేయడం ఒక్కటే మార్గం.శస్త్ర చికిత్సలు కూడా రెండు విధాలుగా ఉంటాయి. ఒకదానిలో ఫైబ్రాయిడ్స్ మాత్రమే తొలగిస్తారు. రెండో దానిలో మొత్తంగా గర్భాశయాన్నే తీసేస్తారు. భవిష్యత్తులో గర్భం దాల్చాలనుకునే వారికి ఫైబ్రాయిడ్స్‌ని తొలగించే శస్త్ర చికిత్సే చేస్తారు. మహిళల్లో గర్భాశయ కణితులు రావడం సాధారణమే. అందుకే క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం అవసరం. ముందుగా గుర్తిస్తే దీన్ని సులభంగా నయం చేయొచ్చు.

ఫైబ్రాయిడ్స్‌కు క్యాన్సర్‌కు సంబంధం లేదు

నీటి బుడగలు ఎక్కువ కాలం గర్భాశయంలో ఉండటం వల్ల క్యాన్సర్‌కు దారి తీసే ప్రమాదం ఉంటుందని చాలామంది మహిళలు భయపడుతుంటారు. అందువల్ల ఆపరేషన్ చేయించుకోవడానికి కూడా వెనుకాడరు. ఇప్పటి వరకు గర్భాశయంలో ఏర్పడిన ఫైబ్రాయిడ్స్‌లో క్యాన్సర్ కు సంబంధించిన ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. గర్భాశయంలో నీటి బుడగలు రావడం, తగ్గడం నిరంతరం జరుగుతుంది. కానీ ఎక్కువ కాలం ఇలానే కొనసాగితే కూడా ప్రమాదకరం అని కొన్ని అధ్యయనాలు చేప్తున్నాయి. థిన్ పీసీఓఎస్, ఒబీస్ పీసీఓఎస్ అని ఉంటాయి. ఒబీస్ అంటే బరువు ఎక్కువ ఉండటం. థిన్ అంటే చాలా బక్కగా, సన్నగా ఉండటం.

థిన్‌గా ఉండేవాళ్ళు నెలనెల పీరియడ్ కూడా అవుతారు. కానీ వాళ్ళు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఫైబ్రాయిడ్స్ పెద్దవిగా ఉండి, సంతానలేమి సమస్యతో బాధపడేవారికి లాపరోస్కోపీ చేసేవాళ్ళం. కానీ అది కూడా చేయొద్దు అనే వివాదం నడుస్తుంది. లాపరోస్కోపీ చేయడం వల్ల కూ డా ఎక్కువ హానికరం అవుతుంది. లాపరోస్కోపీ చేసిన సంవత్సరానికి కూడా మళ్ళీ నీటి బుడగలు రావొచ్చు. అందువల్ల ఆపరేషన్ శాశ్వత పరిష్కారం కాదు. లాపరోస్కోపీ ద్వారా కేవలం నీటి బుడగలను డ్రిల్ చేసి నీటిని బయటకు తీస్తాం. దాని వల్ల కొంతవరకు హార్మోన్లలో మార్పులు వస్తాయి అంతే. ఆ సమయం లో కొన్ని జాగ్రతలు పాటిస్తే సంతానలేమి సమస్య నుంచి బయట పడొచ్చు.

సీనియర్ హెల్త్ ఆఫీసర్, 

గైనకాలజిస్టు  డాక్టర్ ఎల్. జయశ్రీ. 

లాలాపేట్, సికింద్రాబాద్

రూప