calender_icon.png 2 August, 2025 | 2:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాణాలు తీస్తున్న వేగం

11-08-2024 07:16:22 AM

  1. మద్యం మత్తు.. ర్యాష్ డ్రైవింగ్ కూడా ప్రధాన కారణం 
  2. ట్రాఫిక్ పోలీసుల సూచనలు బేఖాతరు 

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 10 (విజయక్రాంతి): నగరంలో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. కొందరు వాహనదారుల నిర్లక్ష్యం అమాయక ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటోంది. గమ్యం చేరే తొందరలో వేగంగా వాహనాలు నడుపుతూ కొంద రు.. ర్యాష్ డ్రైవింగ్‌తో మరికొందరు రోడ్డు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. సిటీ రోడ్లపై సుమారు ఒక కోటి వరకు వాహనాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపడుతున్నా వాహనదారుల్లో మార్పు రావడం లేదు. హైదరాబాద్ వ్యాప్తంగా జనవరి నుంచి జూలై  వరకు పోల్చితే 2022 సంవత్సరంలో 1,238 రోడ్డు ప్రమాదాలు, 2023లో 1,338 ప్రమాదాలు, 2024లో 1,897 రోడ్డు ప్రమాదాలు జరిగాయని అధికారులు వెల్లడించారు.

ఈ ప్రమాదాలలో 2022లో 1,251 మంది, 2023లో 1,350 మంది, 2024లో 2,113 మంది గాయపడ్డారు. అలాగే 2022లో 184 మంది, 2023లో 190 మంది, 2024 లో 150 మంది ప్రాణా లు కోల్పోయారు. గతేడాదితో పోల్చితే మరణాల సంఖ్య 26 శాతం తగ్గుముఖం పట్టినప్పటికీ, ప్రమాదాల సంఖ్య 41 శాతం పెరిగిందని ట్రాఫిక్ అధికారులు తెలిపారు. మృ త్యువాత పడిన వారిలో ఎక్కువ శాతం యువత  ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. 

ర్యాష్ డ్రైవింగ్..

రోడ్డు ఎక్కామంటే చాలు.. కొందరు మితిమీరిన వేగం, ర్యాష్ డ్రైవింగ్‌తో వాహ నాలను సిటీ రోడ్లపై పరుగులు పెట్టిస్తున్నారు. వీరి నిర్లక్ష్యం కారణంగా తమ ప్రాణా లను కోల్పోవడమే కాకుండా ఎదుటి వారి ప్రాణాలను కూడా తీస్తున్నారు. ‘వేగం కంటే ప్రాణం ముఖ్యం’ అన్న మాటను పక్కన పెట్టి ఇష్టారీతిన వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. గమ్యం చేరే తొందరలో కొందరు వాహనదారులు రోడ్లపై ఉన్న వాహనాలను పట్టిం చుకోకుండా తాము ముందు వెళ్లడమే ముఖ్యం అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. 

ట్రాఫిక్ ఉల్లంఘనలు..

నగరంలో ట్రాఫిక్ ఉల్లంఘనదారులు పెరిగిపోయారు. రాంగ్‌సైడ్ డ్రైవింగ్, సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్, ఓవర్ టేక్, ర్యాష్ డ్రైవింగ్‌తో ప్రమాదాలకు ప్రధాన కారణమవుతున్నారు. వీరి మూలంగా ప్రతి యేటా వందల సంఖ్య లో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొందరు మద్యం మత్తులో అర్ధరాత్రుళ్లు ఇష్టారీతిన వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. 

కానరాని ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు..

ట్రాఫిక్ తీవ్రతను తగ్గించడానికి ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసిన యూటర్న్‌లు ఎక్కడో దూరంగా ఉండ డం.. పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా ప్రభుత్వాలు రోడ్లు, ఫుట్ పాత్‌లు, ఫుట్‌ఓవర్ బ్రిడ్జిలు తదితర వ్యవస్థను మెరుగుపరచకపోవడం తదితర కారణాలతో నగర ప్రజలు రోడ్లపై నడిచే క్రమంలో, రోడ్డు దాటే సమయంలో ఎక్కువగా ప్రమాదాలకు గుర వుతున్నారు. ఇక ఫుట్‌ఓవర్ బ్రిడ్జిలు ఎక్కడో కానీ కనపడవు. ఉన్నవాటి నిర్వహణసరిగా ఉండదు. తద్వారా ప్రజలు డివైడర్లను దాటుకొని రోడ్డు క్రాస్ చేయాల్సిన పరిస్థితి. ఇప్పటికైనా ప్రమాదాలను తగ్గించడానికి ఫుట్‌పాత్‌లు ఆక్రమణలకు గురికాకుండా చూడడం, నూతన ఫుట్ ఓవర్‌బ్రిడ్జిలను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.