calender_icon.png 2 August, 2025 | 5:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మారుమూల ప్రాంతాలకు విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యం

02-08-2025 02:38:17 PM

రూ.2.2 కోట్ల వ్యయంతో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్ర ప్రారంభం..

ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క..

వనపర్తి (విజయక్రాంతి): రాష్ట్రంలోని ప్రతి మారుమూల ప్రాంతాలకు నాణ్యమైన నిరంతర విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Deputy Chief Minister Mallu Bhatti Vikramarka) అన్నారు. శనివారం వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం వెలటూరు గ్రామంలో రూ.2.2 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యుత్, ఆర్థిక, ప్రణాళిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర ఆబ్కారీ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవితో కలిసి ప్రారంభోత్సవం చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నా రెడ్డి, ఎస్పీడీసీఎల్ సిఎండి ముషారఫ్ అలీ ఫారుకి, వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి, నాగర్ కర్నూల్ శాసనసభ్యులు కూచుకుల్ల రాజేష్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణు వర్ధన్ రెడ్డి సైతం ఉన్నారు.

ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలోనీ ప్రతి మారుమూల ప్రాంతానికి నాణ్యమైన నిరంతర విద్యుత్ ఇవ్వటమే ప్రభుత్వం ధ్యేయం అన్నారు. ఇందులో భాగంగానే నేడు మారుమూల గ్రామమైన చిన్నంబావి వెలటూర్ గ్రామంలో ఒక 33/11 కెవి సబ్ స్టేషన్ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగిందన్నారు. దీనితో పాటు పానగల్ మండల పరిధిలో రూ. 49.86 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న132/33 కేవీ విద్యుత్ ఉపకేంద్రానికి, పానగల్ మండలం  జమ్మాపూర్ గ్రామంలో రూ. 2.02 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రానికి నేడు కొల్లాపూర్ లో శంకుస్థాపనలు చేయనున్నట్లు తెలిపారు. పానగల్ మండలంలో 132/33 కెవి సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తి అయి ప్రారంభిస్తే అక్కడి నుండి కొత్తగా మరో (15) 33/11 సబ్ స్టేషన్ల నిర్మాణానికి అనుసంధానం చేయవచ్చన్నారు.

నాగర్ కర్నూల్ జిల్లాలోని కోడేరు మండలంలోని మైలారం, మాచుపల్లి, పస్పుల, పెద్దకొత్తపల్లి మండల పరిధిలో వెన్నంచర్ల, మరికల్ గ్రామాలకు సంబంధించిన మరో 4 సబ్ స్టేషన్లకు కొల్లాపూర్ లో శంఖుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. వెలటూర్ గ్రామంలో రూ. 2.2 కోట్ల వ్యయంతో  ఏర్పాటు చేసిన 33/11 కెవి సబ్ స్టేషన్ ద్వారా 3 ఫీడర్ల తో 950 బోరుబావులు, 600 డొమెస్టిక్ కనెక్షన్లు ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. మూడు ఫీడర్ల కింద 6 గ్రామాలు వెలటూర్, చిన్న మహదేవ్, అయ్యవారిపల్లి, కాలుర్, వెంకటంపల్లి, సోలీపూర్ గ్రామాలకు మూడు ఫేజ్ ల నాణ్యమైన విద్యుతు అందనుంది. ఆయా గ్రామాల పరిధిలోని గృహ, వ్యవసాయ భూములకు కరెంట్ కష్టాలు తీరనున్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రావుల గిరిధర్, అదనపు కలెక్టర్ రెవెన్యూ ఇంచార్జి సుబ్రమణ్యం, టి.జి.ఎస్.పి.డి.సి ఎల్ ఎస్.ఈయు. బాలస్వామి, డి. ఈ శ్రీనివాస్, గ్రంథాలయ చైర్మన్ గోవర్ధన్ సాగర్,  కాంగ్రెస్ నాయకులు కొత్త కళ్యాణ్ రావు, జూపల్లి అరుణ్, రాజేంద్ర ప్రసాద్, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.