02-08-2025 02:32:43 PM
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు..
జయశంకర్ భూపాలపల్లి (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, రైతు సంక్షేమం లక్ష్యంగా వివిధ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) అన్నారు. శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం తాడిచర్ల గ్రామంలో 50 లక్షల వ్యయంతో నిర్మించిన సహకార సంఘం కార్యాలయం, గోదాము, 25 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రంథాలయ భవనం, 7.80 లక్షలతో రైతు వేదిక వద్దకు నిర్మించనున్న సీసీ రోడ్డు పనులు, 3.5 లక్షల వ్యయంతో నిర్మించనున్న పిఎసిఎస్ ఆర్చి గేటు నిర్మాణ పనులను, 12 లక్షల రూపాయలతో నిర్మించనున్న తహసిల్దార్ కార్యాలయ ప్రహరీ గోడ పనులను మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, తొమ్మిది రోజుల్లో 9000 కోట్ల రూపాయలను రైతు భరోసా ద్వారా అందించి రైతుకు ఆర్థికంగా అండగా నిలిచామని చెప్పారు. తాడిచర్లలో సహకార సంఘం కార్యాలయం ఏర్పాటు చేయడం వల్ల బ్యాంకు సేవలు వ్యవసాయ రుణాలు మంజూరు సులభతరం అవుతాయన్నారు. బ్యాంకులో లాకర్ల ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తాడిచర్ల గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. విద్యార్థులు, యువకులు ప్రతిరోజు గ్రంథాలయానికి వచ్చి విజ్ఞానాన్ని పెంపొందించుకొని పోటీ పరీక్షల ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. విద్యార్థులకు అవసరమైన స్టడీ మెటీరియల్ గ్రంథాలయంలో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
10 సంవత్సరాలుగా రేషన్ కార్డులు లభించని వారి సమస్యకు కొత్త రేషన్ కార్డుల మంజూరు ద్వారా పరిష్కారం లభించిందని, పాత రేషన్ కార్డుల్లో కూడా కుటుంబ సభ్యులను అదనంగా చేసినట్లు చెప్పారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ శర్మ, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి గ్రంధాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, సింగిల్ విండో చైర్మన్ ఇర్ఫా మొండయ్య, సహకార అధికారి వాలియనాయక్, వ్యవసాయ అధికారి బాబురావు, మహాదేవపూర్ ఏ డి ఏ శ్రీ వ్యాల్, తహసిల్దార్ రవి తదితరులు పాల్గొన్నారు.