calender_icon.png 2 August, 2025 | 10:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీపీ కార్మికుల రాష్ట్ర మహా సభను విజయవంతం చేయాలి

02-08-2025 02:22:45 PM

సిఐటియు నేత నాగన్న పిలుపు..

మహబూబాబాద్ (విజయక్రాంతి): గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అనుసరించాల్సిన విధివిధానాలను రూపకల్పన చేయడం కోసం ఈనెల 23, 24 తేదీల్లో మహబూబాబాద్ జిల్లా గార్లలో నిర్వహించే రాష్ట్ర ఐదవ మహాసభలను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు కుమ్మరి కుంట్ల నాగన్న గ్రామపంచాయతీ కార్మికుల యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ధర్మారపు సుధాకర్ పిలుపునిచ్చారు. శనివారం జిల్లాలోని కంబాలపల్లి గ్రామపంచాయతీ కార్మికులతో కలిసి మహాసభల పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో 12,769 గ్రామాల్లో 52 వేలకు పైగా కార్మికులు అనేక సంవత్సరాలుగా తక్కువ వేతనంతో మల్టీపర్పస్ వర్కర్లుగా విధులు నిర్వహిస్తున్నారని, వారికి ఉద్యోగ భద్రత, వేతన పెంపు, ఇతర అలవెన్స్ లు, సౌకర్యాలను కల్పించడంలో ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు నెరవేరడం లేదని ఆరోపించారు.

మల్టీ పర్పస్ విధానాన్ని తొలగించి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనంగా నెలకు 26వేల రూపాయలను ప్రకటించాలని, గ్రామపంచాయతీ కార్మికులకు శాపంగా మారిన జీవో నెంబర్ 51 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన కార్మికులకు పదోన్నతులు కల్పించాలని, తమ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా భవిష్యత్తులో ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు హుస్సేన్, అబ్బాస్, యాకయ్య, కిషన్, విజయ్, రాములు, లక్ష్మి, వెంకన్న, రాజు, వీరేందర్, రాణి పాల్గొన్నారు.