10-09-2025 01:44:43 AM
-ప్రాసిక్యూషన్ అనుమతి కోరుతూ ప్రభుత్వానికి ఏసీబీ నివేదిక
-గవర్నర్ ఆమోదమే తరువాయి
-ఐఏఎస్ అధికారి అరవింద్‌కుమార్, మరో ముగ్గురిపైనా అభియోగాలు
-9 నెలల సుదీర్ఘ దర్యాప్తు పూర్తి
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): రాష్ర్టవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫార్ములా- ఈ రేసు కేసులో ఏసీబీ తన దర్యాప్తును కీలక దశకు చేర్చింది. గత తొమ్మిది నెలలుగా పకడ్బందీగా సాగించిన విచారణను పూర్తి చేసి, ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్, సీని యర్ ఐఏఎస్ అధికారి అరవింద్‌కుమార్‌తో సహా మొత్తం ఐదుగురిని ప్రాసి క్యూషన్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వానికి సమగ్ర నివేదికను సమర్పించింది.
ప్రభుత్వ పరిశీలన అనంతరం ఈ దస్త్రం గవర్నర్ ఆమోదానికి వెళ్లనుంది. రాజ్ భవన్ నుంచి పచ్చజెండా ఊపిన వెంటనే నిందితులపై ఏసీబీ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఈ పరిణామంతో ఫార్ములా- ఈ కేసులో కేటీఆర్‌కు ఉచ్చు మరింత బిగుస్తున్నట్లు స్పష్టమవుతోంది.
తొమ్మిది నెలల సుదీర్ఘ విచారణగత బీఆర్‌ఎస్ హయాంలో కేబినెట్ ఆమోదం లేకుండా, నిబంధనలకు విరుద్ధం గా ఫార్ములా -ఈటీ రేసు నిర్వాహకులకు ప్రజాధనాన్ని అప్పనంగా కట్టబెట్టారని వచ్చిన ఆరోపణలపై ఏసీబీ కేసు నమోదు చేసింది. తొమ్మిది నెలల పాటు సాగిన ఈ లోతైన దర్యాప్తులో భాగంగా ఏసీబీ అధికారులు పలు కీలక పత్రాలు, డిజిటల్ ఆధా రాలను సేకరించారు.
కేసులో ఏ1గా ఉన్న కేటీఆర్‌ను ఇప్పటికే నాలుగు సార్లు, ఏ2గా ఉన్న అర్వింద్ కుమార్‌ను ఐదుసార్లు సుదీర్ఘంగా ప్రశ్నించి వారి వాంగ్మూలాలను నమోదు చేశారు. వీరితో పాటు హెఎండీఏ మాజీ అధికారి బీఎల్‌ఎన్‌రెడ్డి, కిరణ్‌రావు, ఫార్ములా -ఈ ఆపరేషన్స్ ప్రతినిధుల పాత్రపై కూడా స్పష్టతకు వచ్చారు.
కేటీఆర్ ఆదేశాలతోనే రూ.55 కోట్ల చెల్లింపులు
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ బోర్డుగానీ, రాష్ర్ట కేబినెట్ అనుమతి లేకుండానే కేవలం అప్పటి మం త్రి కేటీఆర్ మౌఖిక ఆదేశాల మేరకు ఫార్ము లా -ఈ రేస్ నిర్వాహక సంస్థకు రూ.55 కోట్లకు పైగా చెల్లింపులు జరిపినట్లు ఐఏఎస్ అర్వింద్‌కుమార్ తన విచారణలో అంగీకరించినట్లు ఏసీబీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ప్రభుత్వ ధనాన్ని ఎలాంటి అధికారిక పత్రా లు, తీర్మానాలు లేకుండా ఒక ప్రైవేట్ సం స్థకు ఎలా బదిలీ చేస్తారన్నదే ఈ కేసులో ప్రధాన అభియోగంగా మారింది. ఈ చెల్లింపులకు సంబంధించిన లావాదేవీలన్నీ నిబంధనలకు విరుద్ధంగా జరిగాయని ఏసీబీ తన నివేదికలో స్పష్టంగా పేర్కొన్నట్లు విశ్వసనీయ సమాచారం.
ప్రభుత్వం నుంచి గవర్నర్ వద్దకు ఫైల్
అవినీతి నిరోధక చట్టం ప్రకారం ప్రజాప్రతినిధులు, అఖిల భారత సర్వీసు అధికా రులపై అభియోగాలు మోపుతూ ఛార్జిషీట్ దాఖలు చేయాలంటే ప్రభుత్వం ద్వారా గవర్నర్ ముందస్తు అనుమతి తప్పనిసరి. ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు తమ వద్ద ఉన్న పక్కా ఆధారాలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి పంపారు.
ప్రభుత్వం నుంచి ఈ ఫైల్ గవర్నర్ వద్దకు చేరగానే, ఆయన న్యా యపరమైన అంశాలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటారు. గవర్నర్ నుంచి అనుమతి వచ్చిన వెంటనే ఏ మాత్రం ఆల స్యం చేయకుండా కేటీఆర్, అరవింద్ కుమార్‌తో పాటు మిగిలిన నిందితులపై ఏసీబీ ప్రత్యేక కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయనుంది. దీంతో ఫార్ములా-ఈ కేసులో న్యాయ పరమైన విచారణ ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కానుంది.