10-02-2026 02:19:45 AM
బిల్లులు కావాలంటే ఆర్‌ఆర్ పన్ను కట్టాల్సిందే!
మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ
మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలంటే తెలంగాణలో ఆర్‌ఆర్ టాక్స్ కట్టాల్సి వస్తుందని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఎంపీ డీకే అరుణ మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసి అనంతరం మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో ఖజానా ఖాళీ అయిందని స్వయంగా సీఎం చెపుతున్నారని, కాబట్టి పన్నులు పెంచే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాంగ్రెస్ మోసం చేసిందని, వృద్ధులకు 4వేల పెన్షన్, డిగ్రీ చదివే యువతులకు ఎలక్ట్రికల్ స్కూటీ, మహిళలకు నెలకు రూ.2500 లాంటి ఎన్నో పథకాలను అమలు చేయకుండా మహిళలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని కోరారు.
మోదీ పాలన స్ఫూర్తితో పాలమూరు కార్పొరేషన్‌కు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తామని హామీ ఇచ్చారు. మహబూబ్ నగర్, జడ్చర్ల, భూత్పూర్ లను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు ఒక ప్రత్యేక ప్రణాళిక తయారు చేసి కేంద్రానికి నివేదించామని తెలిపారు. డ్రైనేజీలు సిసి రోడ్లు త్రాగునీటి సదుపాయాలు 100% కల్పిస్తామని ఈ సందర్భంగా ఎంపీ హామీ ఇచ్చారు. సమావేశంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పద్మజారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు సాహితిరెడ్డి పాల్గొన్నారు.