calender_icon.png 23 July, 2025 | 6:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధి హామీలో అవినీతి కంపు

23-07-2025 12:00:00 AM

పనులు జరగకుండానే రికార్డులు చేసిన పనులకే మళ్లీమళ్లీ రికార్డులు        

జహీరాబాద్, జూలై 22 : పేద, బడుగు, బలహీన వర్గాల వారికి వంద రోజుల పని కల్పించాలనే ఉద్దేశంతో చేపట్టిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రతి సంవత్సరం సామాజిక తనిఖీలు మామూలుగానే ముగుస్తున్నాయి. జహీరాబాద్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఉపాధి హామీ చేపట్టినప్పటికీ గత సంవత్సరం చేసిన పనుల్లోనే మళ్లీ తూతూ మంత్రంగా పనులు చేసి రికార్డులు తయారుచేసి ప్రభుత్వ ధనాన్ని దోచుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

మండల స్థాయి అధికారుల నుండి జిల్లా స్థాయి అధికారుల వరకు ఉపాధి హామీ అంటేనే మామూలు పనిగా భావిస్తున్నారు. ఈనెల 19న ఝరాసంగం మండలంలో ఉపాధి హామీ పథకంపై మండల స్థాయిలో సామాజిక తనిఖీ నిర్వహించారు. ఈ సామాజిక తనిఖీలు ప్రతి గ్రామానికి వెళ్లిన పిఆర్పీలు, బిఆర్పిలు సామాజిక తనిఖీ సంబంధించిన పనులను రికార్డులను పరిశీలించగా రికార్డుల్లో నమోదు ఉన్న పనులు ఫీల్ మీద లేకపోవడంతో పెద్ద మొత్తంలో అవినీతి జరిగినట్లు స్పష్టమయింది.

దీంతో సామాజిక తనిఖీ అధికారులు టెక్నికల్ అసిస్టెంట్ల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. వివిధ గ్రామాల్లో చేపట్టిన సామాజిక తనిఖీల్లో పనులు జరగకుండానే బిల్లులు డ్రా చేసినట్లు స్పష్టంగా తెలుస్తుంది. కొన్ని గ్రామాలలో మస్టర్లలో కూలీల సంతకాలు లేకుండానే డబ్బులు డ్రా చేసినట్లు సామాజిక తనిఖీల్లో బట్టబయలైంది. కోట్లాది రూపాయలు ప్రజాధనం ఉపాధి హామీలో కూలీలకు చెల్లిస్తున్నట్లు రికార్డులు సృష్టిస్తున్నారు.

ఉపాధి హామీ కూలీలు పనిచేయక పోయినప్పటికీ ఫీల్ అసిస్టెంట్లు, మండల స్థాయి అధికారులు కుమ్మక్కై కొందరు ఉపాధి హామీకి హాజరు కానప్పటికీ వారు పేరు మీద ఉపాధి హామీ కూలి చేసినట్లు రికార్డులు తయారుచేసి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నట్లు సామాజిక తనిఖీలో స్పష్టంగా తెలిసింది. కొన్ని పనులు చేయకుండానే బిల్లులు తీసుకున్నట్లు వెళ్లడైంది.

సహజంగా మండల స్థాయి ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నప్పుడు ఉపాధి హామీలో పనిచేసిన కూలీలతో పాటు ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు, సామాజిక స్పృహ కలిగిన వారు పాల్గొనవలసి ఉండగా ఈ విషయాన్ని బహిర్గతం చేయకుండా లోలోనే ప్రజా దర్బార్ నిర్వహిస్తుండడం విస్మయం కలిగిస్తుంది. ఉపాధి హామీ పథకాన్ని రైతుల వ్యవసాయ భూముల్లో నిర్వహించినట్లయితే రైతులకు మేలు జరుగుతుంది.

కానీ ఉపాధి హామీ పనులను ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నా ప్రజలకు ఉపయోగపడేదిగా లేదని రైతులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. రైతులకు కూలీ భారం పెరిగి కూలీలు దొరకకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి హామీ పథకాన్ని రైతులకు అనుసంధానం చేసినట్లయితే వ్యవసాయ ఉత్పత్తి పెరిగి లాభదాయకంగా ఉంటుందని భావిస్తున్నారు. ఇలావుండగా ఉపాధి హామీలో అవినీతి జరిగిందని సామాజిక తనిఖీలో వెల్లడైంతే ఉపాధి హామీ అధికారులు మాత్రం నిజం కాదంటూ వాగ్వివాదానికి దిగడం గమనార్హం. 

అవినీతి ఇలా...

ఏప్రిల్ 2024 నుండి మార్చి 31, 2025 వరకు 465 పనులకు గాను రూ.7 కోట్ల 94 లక్షలు చెల్లించారు మెటీరియల్ కింద పది లక్షల 99 వేల 199 రూపాయలు ఖర్చు చేశారు. పంచాయతీ రాజ్ శాఖ ద్వారా 50 పనులకు కూలీలపై రూ.2,10,00524, మెటీరియల్ కింద 2,20,85092 చేశారు. చీలమామిడి గ్రామంలో కూలీలపై రూ.37,36,172,  మెటీరియల్ కింద రూ. xx28.45 లక్షల ఖర్చు చేసినట్లు బి ఆర్ పి బాలకృష్ణ వెల్లడించారు.

మళ్లింపు కాలువలో చేపట్టిన పనుల కంటే అధికంగా బిల్లులు తీసుకున్నారని ఆయన వివరించారు. 20,050 క్యూబిక్ మీటర్లు అధికంగా ఎంపీ రికార్డు చేసి నిధులు దుర్వినియోగానికి పాల్పడినట్లు వెల్లడించారు. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగి అయిన వీఆర్‌ఏ కు సైతం ఉపాధి హామీ కూలి చెల్లించినట్లు బహిర్గతం చేశారు. ఇంకా చాలా పనుల్లో అవినీతి జరిగినట్లు బీఆర్‌పీ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.

సామాజిక తనిఖీ సమయంలో కొలతలు చేసి చూపించానని టెక్నికల్ అసిస్టెంట్ చెప్పగా అందులో ఏమాత్రం నిజం లేదని బిఆర్పి అధికారులకు వివరించారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. పోలవరం గ్రామంలో కాలువ పనుల్లో అవినీతి జరిగినట్లు డిఆర్పి బాలకృష్ణ వివరించారు. అక్కడ పనులు చేయకుండానే మళ్లింపు కాలువకై అధికంగా ఖర్చు చేసినట్లు రికార్డులు చూపారని ఆయన తెలిపారు.

గ్రామంలో కూలీల సంతకాలు లేకుండానే బిల్లులు చెల్లించారని తెలిపారు. కొన్ని గ్రామాల్లో కూలీలు పనిచేసినప్పటికీ వారికి కూలీ డబ్బులు తక్కువగా వచ్చినట్లు వారు చెప్పారు. కొన్ని గ్రామాల్లో ఒకరికి బదులు మరొకరు పనిచేసినట్లు వెల్లడైంది. ఉపాధి హామీలో జరిగిన అవినీతిని ఉన్నతాధికారులకు నివేదిక అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు. 

సామాజిక తనిఖీ సరియైంది కాదు...

ఝరాసంగం మండలంలో ఉపాధి హామీ పనుల్లో అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీలో వెల్లడించడం సరికాదు. ప్రతియేడు లాగే ఈసారి కూడా ఉపాధి పనులు చేపట్టాం. అయినప్పటికీ అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ సిబ్బంది తనిఖీలో అవినీతి జరిగినట్లు చెప్పడంసరికాదు.

రాజ్కుమార్, ఏపీవో