25-01-2026 12:37:53 AM
‘నిర్మల్ పేరు వినగానే ఇక్కడి చరిత్రకు ఒక ప్రత్యేకత ఉంటుంది. 400 ఏళ్ల నాటి నిర్మల్ చరిత్ర ఇప్పటికీ చెక్కుచెదరని చారిత్రాత్మక కట్టడాల్లో దర్శనమిస్తోంది. నిర్మల్ పట్టణానికి ముఖ ద్వారంగా ఉండే సోన్ చరిత్ర కూడా ఘనంగానే ఉంది. నాటి సువర్ణపురమే నేడు సోన్ గ్రామంగా పిలువబడుతోంది. సోన్ (సువర్ణపురి) వింతలు.. విశేషాలు.. చరిత్రపై ‘విజయక్రాంతి’ ప్రత్యేక కథనం.’
నిర్మల్, విజయక్రాంతి: నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల సరిహద్దును సూచిస్తూ గోదావరి నదిపై నిర్మించిన సోన్ వంతెన ఇప్పటికీ చెక్కుచెదరకుండా చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తుంది. 1932లో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం 38 రాతి పిల్లలతో బంకసున్నపు మట్టి సాయంతో ఈ వంతెన నిర్మించగా, ఇది ప్రస్తుతం ఎప్పటికీ పాతవంతెనగా చరిత్ర పూటల్లో నిలిచి ఉంది. 17వ శతాబ్దంలో పరశురాముడు తన పాపాల నుంచి ప్రాయశ్చిత్తం పొందినందుకు గోదావరి తీరం వెంబడి ప్రయాణం చేస్తూ వివిధ ప్రాంతాల్లో సేద తీర్చుకుంటూ శివలింగాలను ఏర్పాటు చేసుకుని పూజించేవారట.
అప్పట్లో పరశురాము డు సోను గ్రామంలో ఉన్నప్పుడు బంగారు వ్యాపారానికి ఇది కేంద్రంగా ఉండే. ఈ బంగారంపై కన్నేసిన అప్పటి రాజు లు దోచుకునేందుకు ప్రయత్నించగా పరశురాముడికి కోపం వచ్చి బంగారం మొత్తం నల్లబండగా మార్చేశారట. ఈ ప్రాంతంలో బంగారం ఉండడం వల్ల దీని హిందీలో సోనా అని పిలిచేవారు. రానురాను అది సోన్ గ్రామంగా మారిపోయింది. గోదావరి జన్మించిన మహారాష్ట్రలోని నాసిక్ నుంచి రాజమండ్రి ధవలేశ్వరం వరకు ఎక్కడ కూడా గోదావరిలో నల్ల బండలు కనిపించవు. కానీ సోన్‌లోని పుష్కర ఘాట్ల వద్ద పెద్దపెద్ద నల్లబండలు ఇప్పటికీ దర్శనమిస్తాయి. అప్పటి బంగారం నిలువలను బండరాలుగా మారిపోవాలని పరశురాముడు శాపం ఫలితంగానే ఆ బంగారం నిల్వలు నల్లబండలుగా మారాయని చరిత్ర చెబుతోంది.
గ్రామంలో విశిష్టతలు ఎన్నో..
నిర్మల్ జిల్లాకు సరిహద్దు ముఖద్వారంగా ఉన్న సోన్ గ్రామంలో ఎన్నో వింతలు విశేషాలు ఇప్పటికీ ఉన్నాయి. 17వ శతాబ్దంలో నిర్మించిన శ్రీ దత్తానందస్వామి మఠం వెంకటరమణ నరసింహస్వామి ఆలయం రెండు గోపురాలతో ఒకే ఆలయం నిర్మించారు. ఆలయంపై శ్రీచక్ర లింగం పాలెం లోపల చక్ర కొలువు ఉంది. ఇందులో లక్ష్మీదేవి, అంజనేయుడు, నరసింహస్వామి, వెంకటేశ్వరస్వామి రాతి కట్టడాలు ఇప్పటికి చెక్కుచెదరకుండా దర్శనమిస్తాయి. పెద్దపెద్ద శిలలతో ఆనాటి చరిత్ర తెలిపే హస్త కళలు ఉన్నాయి. ఈ గ్రామంలో వేద పండిత బ్రాహ్మణులు జిల్లాలోనే అత్యధికంగా ఉంటారు. ఇక్కడ వేదం బ్రాహ్మణ మఠం ఉన్నాయి. గోదావరి నదిలో రెండు పుష్కర ఘాట్లు నిర్మించారు.
గ్రామంలో 30 రకాల దేవతల ఆలయాలు ఉండడంతో ప్రతిరోజు ఆలయాల్లో వివిధ వర్గాల వారు పూజలు నిర్వహిస్తారు. సోన్ గ్రామ సరిహద్దులు నిర్మల్ నాయుడు కాలంలో నిర్మించిన సోన్‌గడ్ ఇప్పటికీ చెక్కుచెదరకుండా దర్శనమిస్తుంది. నిర్మల్ పట్టణంపై దండెత్తే శత్రు సైనికులను ముందుగా ఎదుర్కొనందుకు అప్పటి నిర్మల నాయుడు గోదావరి తీరంలో ఈ కోటలు నిర్మించారు. అక్కడి నుంచి నిర్మల్ పట్టణంలోని వివిధ కోటలకు సొరంగ మార్గం ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. నాటి సువర్ణపురి గ్రామమే నేడు సోన్ గ్రామంగా పిలువబడుతుంది.