calender_icon.png 25 January, 2026 | 3:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూసఫ్‌గూడ యార్డ్‌లో ఘోర విషాదం

25-01-2026 12:54:52 AM

చెత్త తొలగిస్తుండగా మిషన్‌లో పడి కార్మికుడి మృతి

హైదరాబాద్ సిటీ బ్యూరో, జనవరి 24 (విజయక్రాంతి): నగరంలోని యూసఫ్ గూడలోని చెత్త డంపింగ్ యార్డ్‌లో శనివారం తెల్లవారుజామున  చెత్తను తొలగించే పనుల్లో కార్మికులు నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో చెత్తను ప్రాసెస్ చేసే మిషన్ వద్ద పని చేస్తుండగా, ఊహించని విధంగా లారీ డోర్ విఫలమైంది. దీంతో పట్టుతప్పిన కార్మికుడు ఒక్కసారిగా కాలుజారి ఆ మిషన్‌లో పడిపోయాడు. తోటి కార్మికులు బయటకు లాగేందుకు ప్రయత్నించినప్పటికీ, అప్పటికే శరీరమంతా నుజ్జునుజ్జు కావడంతో కార్మికుడు ప్రాణాలు విడిచాడు.

మృతుడిది ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా, దుగ్గలి మండ లం, పగిడిరాయి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చి జీహెచ్‌ఎంసీలో కాంట్రాక్ట్,ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నం టాయి. ఈ ప్రమాదంపై జీహెచ్‌ఎంసీ కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ముమ్మాటికీ డంపింగ్ యార్డ్ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న రాంకీ సంస్థ నిర్లక్ష్యం వల్లే అని మండిపడ్డారు.

భద్రతా ప్రమాణాలు పాటించకపో వడం, వాహనాల కండిషన్ సరిగ్గా లేకపోవడం వల్లే లారీ డోర్ ఫెయిల్ అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు.  విధులను బహిష్కరించి డంపింగ్ యార్డ్ వద్ద బైఠాయించారు. యాజమాన్యం మృతుడి కుటుంబానికి భారీ నష్టపరిహారం చెల్లించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటన లు జరగకుండా చూడాలని కోరారు.