8 April, 2026 | 1:28 AM

ఈ నెలాఖరులోపు లక్ష్యం మేరకు చేప పిల్లలను విడుదల చేయాలి

08-11-2025 12:24 AM

-జిల్లా ఇంచార్జి కలెక్టర్ డాక్టర్ శ్రీజ 

ఖమ్మం, నవంబర్ 7 (విజయ క్రాంతి): నవంబర్ నెలాఖరు లోపు లక్ష్యం మేరకు చేప పిల్లలను విడుదల చేయాలని జిల్లా ఇంచార్జి కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ తెలిపారు. జిల్లా ఇంచార్జి కలెక్టర్ శుక్రవారం ఖమ్మం రూరల్ మండల కేంద్రంలో చేప పిల్లల పంపిణీ చేసే డిస్ట్రిబ్యూషన్ పా యింట్ ను పరిశీలించారు. అనంతరం ఆరెంపుల బారుగూడెం నల్ల చెరువులో చేప పిల్లలను విడుదల చేసారు. ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జి కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ మాట్లాడుతూ మండల స్థాయిలో డిస్ట్రిబ్యూషన్ కమిటీ ఆధ్వర్యంలో చేప పిల్లల విడుదల సజావుగా జరగాలని అన్నారు.

ఆరెంపుల బారుగూడెం నల్ల చెరువులో 28 వేల 800 చేప పిల్లలు విడుదల చేయాల్సి ఉన్నదని, రవ్వ, బొచ్చ, బంగారు తీగ రకాల చేప పిల్లలను శుక్రవారం నల్ల చెరువులో విడుదల చేయడం జరిగిందని, అన్నారు. ఖమ్మం రూరల్ మండలంలోని 38 చెరువులలో 9.5 లక్షల చేప పిల్లలు నెలాఖరు లోపు విడతల వారీగా విడుదల చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం రూరల్ ఎంపిడిఓ కె. రవికుమార్, ఎంపీవో శ్రీదేవి, ఫిషరీస్ మండల ఇంచార్జ్ లు నవీన్, లక్ష్మణ్, సరిత, పంచాయతీ కార్యదర్శి, వ్యవసాయ విస్తరణ అధికారి, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.