08-11-2025 12:22:27 AM
జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం నవంబర్ 7, (విజయక్రాంతి):భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లో శుక్రవారం, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, వడ్రంగి (కార్పెంటర్) సంఘ పెద్దలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫర్నిచర్ రంగంలో నైపుణ్యం కలిగిన యువతకు లభిస్తున్న అవకాశాలను వివరించి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాజమండ్రిలో ఈ సోమవారం నుండి ప్రారంభమయ్యే రెసిడెన్షియల్ ఫర్నిచర్ అసిస్టెంట్ శిక్షణ కోసం 11 సీట్లు అందుబాటులో ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. దీనికి సంబంధించి శనివారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్లోని S-20 గదిలో ఒరియంటేషన్ , ఎంపిక పరీక్ష నిర్వహించ బడుతుందన్నారు.
శిక్షణకు ఎంపికయ్యే అభ్యర్థులకు:
ఒక్కొక్కరికి రూ. 5,000 రిజిస్ట్రేషన్ ఫీజును జిల్లా యంత్రాంగం భరిస్తుందని, వసతి , భోజనం పూర్తిగా ఉచితంగా ఆ సంస్థ ద్వారా కల్పించ బడుతుందన్నారు.శిక్షణ పూర్తయ్యిన వెంటనే రూ. 15,000/- స్తాయిలో 6 నెలల అప్రెంటిస్షిప్ అవకాశాన్ని కూడా కల్పిస్తారని, అనంతరం 100% ప్లేస్మెంట్ అదే సంస్థలోనే కల్పిస్టారని పేర్కొన్నారు. ఇప్పటికే జిల్లాలో ఎన్ ఎస్ టి ఐ, ఎఫ్ ఎఫ్ ఎస్ సి ఆధ్వర్యంలో మొదటి విడతలో 8 మంది శిక్షణ పూర్తి చేసుకుని అప్రెంటిస్షిప్లో ఉన్నారన్నారు. రెండవ విడతలో 19 మంది అభ్యర్థులను గురువారం ఎంపిక చేసినట్లు కలెక్టర్ తెలిపారు. రాజమండ్రి శిక్షణ కోసం ఇంకా 11 మందిని శనివారం ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని వడ్రంగి/కార్పెంటర్ యువతతో పాటు ఆసక్తి ఉన్న ఇతర యువత కూడా వినియోగించుకోవాలని కలెక్టర్ పిలుపు నిచ్చారు.