17-05-2025 04:26:28 PM
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): ఉపాధ్యాయుడు ఎల్లవేళలా నిత్య విద్యార్థిగా ఉంటూ ఎప్పటికప్పుడు నూతన బోధన నిర్వహించాలని, మెళకువలను అభివృద్ధి పరచుకుంటూ వాటి సహాయంతో విద్యార్థుల్లో అంతర్లీనంగా ఉండే అంతర్గత నైపుణ్యాలను, సామర్ధ్యాలను గుర్తించాలన్నారు. వాటిని వెలికితీస్తూ వారిని ఉత్తమ పౌరులుగా సమాజానికి అందించే అరుదైన గురుతర బాధ్యత ఉపాధ్యాయులదే, కావున అందుకు కృషి చేయాలని కొత్తగూడెం మండల విద్యాశాఖ అధికారి డాక్టర్ ప్రభుదయాల్(Mandal Education Officer Dr. Prabhudayal) కోరారు. పాత కొత్తగూడెం లోని విద్యా శిక్షణ సంస్థలో నిర్వహించబడుతున్న ఉపాధ్యాయుల ప్రత్యేక శిక్షణ శిబిరంలో ఆయన పాల్గొని పలు విద్యా విషయాలను, నూతన విద్యా పోకడలను గూర్చి వివరించారు.
విద్యారంగంలో ప్రాథమిక విద్య పునాది వంటిదని ఆ స్థాయిలోనే విద్యా పునాదులు సక్రమంగా ఉంటే ఆపై ఎంతటి స్థాయిలనైన సులభంగా విద్యార్థులు అధిగమిస్తారన్నారు. విద్యాబుద్ధులు నేర్పుతూ శ్రేయోభిలాషిగా ఉండే ఉపాధ్యాయులను విద్యార్థులు తమ జీవితాంతం గుర్తుంచుకుంటారన్నారు. అందుకే అన్ని వృత్తుల్లో కెల్లా ఉపాధ్యాయ వృత్తి శ్రేష్టమైనదన్నారు. ప్రభుత్వం అనేక విద్యా నూతన సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందనీ, ఇది మంచి పరిణామమన్నారు. అదే రీతుల్లో చిత్తశుద్ధితో కృషి చేస్తే అద్భుత ఫలితాలను సాధించవచ్చన్నారు. ఈనెల 20 నుండి 24 వరకు నిర్వహించే మండల స్థాయి శిక్షణ కార్యక్రమాలను సమర్ధవంతంగా, సౌకర్యవంతంగా నిర్వహించాలని కోరారు. ఈ శిబిరంలో జిల్లా స్థాయి, మండల స్థాయి రిసోర్సపర్సన్లు పాల్గొన్నారు.