23-08-2025 07:15:32 PM
కొత్తపల్లి (విజయక్రాంతి): శ్రీ రాజరాజేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల(Sri Raja Rajeshwara Government Arts and Science Degree College) కరీంనగర్ లో నేడు జర్నలిజం సర్టిఫికెట్ కోర్స్ వీడ్కోలు కార్యక్రమం, సర్టిఫికెట్స్ ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ కవి, పాత్రికేయులు అన్నవరం దేవేందర్ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ, జర్నలిజం సాహసంతో కూడుకున్న వృత్తి అని దానికి పరిశీలన, పరిశోధన, వాస్తవికత, నిష్పాక్షికత ఆభరణాలని అన్నారు. పాత్రికేయ విలువలను పెంచేవిధంగా వృత్తి నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలని అన్నారు. కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య కలువకుంట రామకృష్ణ మాట్లాడుతూ, తెలుగు విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన జర్నలిజం చక్కటి ప్రణాళికతో కూడుకున్నదన్నారు.
శీర్షిక నుండి మొదలుకొని ప్రతి అక్షరం, పదం, వాక్యం సమాజపు మేలునుకోరే విధంగా ఉండాలన్నారు. వార్తలు సంచలనాలకన్నా ప్రధానంగా సందర్భ శుద్ధితో కూడి ఉండాలని సూచించారు. తదుపరి తెలుగు విభాగ అధ్యక్షులు డా. బూర్ల చంద్రశేఖర్ మాట్లాడుతూ, పాత్రికేయ వృత్తి పరమపవిత్రమయిందని దాన్ని ప్రజల క్షేమం కోసం వాడుకోవాలని అన్నారు. అనంతరం ముఖ్య అతిథి చేతుల మీదుగా విద్యార్థులకు సర్టిఫికెట్ల ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు విభాగ అధ్యాపకులు బూర్ల వెంకటేశ్వర్లు, డా. డి. ప్రకాష్, డాక్టర్ ఆర్ శ్రీనివాస్, మెట్టు వేంకటేశ్వర్లు, డా. పాత అశోక్. డా. పి. చైతన్య, డా. టి. భోజన్న, డా. పి. అనిల్, పి.శంకర్, విద్యార్థులు పాల్గొన్నారు.