ఓటు అక్కడ.. పోటీ ఇక్కడ..
తమ ఓటు తమకే వేసుకోలేక పోయిన ఎంపీ అభ్యర్థులు
హైదరాబాద్ సెగ్మెంట్లో ముగ్గురిది ఇదే పరిస్థితి
హైదరాబాద్, మే 13 (విజయక్రాంతి): లోక్‌సభ పోలింగ్ వేళ రాష్ట్రంలో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. సోమ వారం జరిగిన పోలింగ్‌లో కొందరు ప్రధాన పార్టీల అభ్యర్థులు తమకు తామే ఓటు వేసుకోలేకపోయారు. వారికి ఓటు హక్కు ఉన్నది ఒక పార్లమెంట్ నియోజకవర్గం కాగా పోటీ చేసింది మరొక సెగ్మెంట్ కావడమే ఇందుకు కారణం. ఓటు వేసుకోలేపోయిన వారిలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎంకు మొత్తం ఐదుగురు అభ్యర్థులు ఉన్నారు.
అసదుద్దీన్ ఓవైసీ: ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ తన ఓటు ను తాను వేసుకోలేకపోయారు. వాస్తవానికి చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని రాజేంద్రన గర్‌లో ఓవైసీ ఓటరుగా ఉన్నారు. చాలాకాలంగా ఆయనకు అక్కడే ఓటు హక్కుంది. దీంతో ఆయన హైదరాబాద్‌లో పార్లమెంట్ పరిధిలో ఓటు వేయలేరు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో ఎంఐఎం అభ్యర్థి లేకపోవడం గమనార్హం. దీంతో తన ఓటు ఎవరికి వేసి ఉంటారనేది ఆసక్తికరంగా మారింది.
మాధవీలత: బీజేపీ నుంచి హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొంపెల్ల మాధవీలత అనతి కాలంలోనే చాలా పాపులర్ అయ్యారు. అయితే మాధవీలతకు హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఓటు లేదు. ఆమె ఈస్ట్ మారేడుపల్లిలోని మహేంద్రహిల్స్‌లో ఓటరుగా ఉన్నారు. మారేడుపల్లి మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో వస్తుంది. దీంతో ఆమె తన ఓటును పాతబస్తీలో వేయలేకపోయారు.
మహ్మద్ వలీవుల్లా సమీర్: కాంగ్రెస్ నుంచి హైదరాబాద్ ఎంపీగా బరిలోకి దిగిన మహ్మద్ వలీవుల్లా సమీర్‌కు కూడా స్థానికంగా ఓటు హక్కు లేదు. ఆయనకు జూబ్లీహిల్స్‌లో ఓటు హక్కు ఉంది. ఇది సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. హైదరాబాద్ నుంచి పోటీ చేసిన నలుగురు ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో ముగ్గురికి స్థానికంగా ఓటు లేకపోవడం గమ నార్హం. బీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసిన గడ్డం శ్రీనివాస్‌యాదవ్‌కు మాత్రమే హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఓటు హక్కు ఉంది.
పట్నం సునీతా మహేందర్ రెడ్డి: మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థిగా పట్నం సునీతామహేందర్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. అయితే ఆమెకు తాండూరు అసెంబ్లీ పరిధిలో ఓటు ఉంది. తాండూరు అసెంబ్లీ చేవెళ్ల పరిధిలోకి వస్తుంది.
కాసాని జ్ఞానేశ్వర్: చేవెళ్ల నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాసాని జ్ఞానేశ్వర్‌కు మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలోని కుత్బుల్లాపూర్‌లో ఓటు హక్కు ఉంది. ఫలితంగా ఈయన కూడా తన ఓటు తనకు వేసుకోలేకపోయారు.
రామసహాయం రఘురాంరెడ్డి: కాంగ్రెస్ నుంచి ఖమ్మం లోక్‌సభకు రామసహాయం రఘురాంరెడ్డి పోటీ చేశారు. అయితే ఈయనకు కూడా ఖమ్మంలో ఓటు హక్కు లేదు. రఘురాంరెడ్డి మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో ఓటరుగా ఉన్నారు.




