27-01-2026 12:00:00 AM
చిట్యాల, జనవరి 26 : చెరువుగట్టు బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకను సోమవారం తెల్లవారుజామున కన్నుల పండువగా నిర్వహించారు. నల్లగొండ జిల్లాలోని నార్కెట్పల్లి మండలం చెర్వుగట్టు గ్రామంలోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వారి కల్యాణ మహోత్సవ వేడుక అర్చక బృందం వేదమంత్రాలతో, మంగళ వాయిద్యాల నాదాలతో, ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో, ఆలయ అధికారులు అంగరంగ వైభవంగా నిర్వహించా రు.
ప్రభుత్వం తరపున స్వామి వారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం - పుష్ప దంపతులు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి కల్యాణ వేడుకను రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన భక్తులు కన్నుల పండుగగా వీక్షించారు. అంగరంగ వైభవంగా జరిగిన శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించడానికి భక్తులు ముందు రోజు రాత్రి నుంచే ఆలయానికి చేరుకొని కోనేటిలో పుణ్యస్నానాలు ఆచరించి భక్తిశ్రద్ధలతో స్వామివారి కల్యాణాన్ని వీక్షించి, తలంబ్రాలు ఒడిబియ్యం సమర్పించారు.
శివనామస్మరణతో చెరువుగట్టు పుణ్యక్షేత్రం మారు మ్రోగిపోయింది. లక్షలాది భక్తులతో కిటకిటలాడిన ఆలయ ప్రాంగణం జనసంద్రంగా మారింది. తలంబ్రాలు ఒడి బియ్యం సమర్పించడానికి వచ్చిన భక్తుల రద్దీతో ఘాట్ రోడ్ లో అడుగు పెట్టే స్థలం లేకుండా నిండిపోయింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ తెలంగాణలో రెండవ శ్రీశైలం గా పిలవబడే చెరువుగట్టు బ్రహ్మోత్సవాలకు హాజరైన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని, ప్రతి ఒక్కరు క్షేమంగా తమ గమ్యస్థానాలకు చేరాలని కోరారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, ప్రసాద పంపిణీ, ఇతర మౌలిక సదుపాయాలను నిర్వాహకులు సమర్ధంగా ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. స్వామి వారి ఆశీస్సులతో సుఖసంతోషాలు, శాంతి సమృద్ధి చేకూరాలని భగవంతుడిని వేడుకున్నామని అన్నారు. కళ్యాణ కార్యక్రమంలో నల్గొండ ఆర్డీవో అశోక్ రెడ్డి, డీఎస్పీ శివరాం రెడ్డి,ఆలయ ఈవో మోహన్ బాబు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.